బీసీలకూ సబ్ ప్లాన్ అమలుపై యోచన: పొన్నం
ABN , Publish Date - Mar 29 , 2026 | 06:28 AM
రాష్ట్రం మొత్తం జనాభాలో 56.36 శాతానికి పైగా ఉన్న బీసీల కోసం ప్రత్యేకంగా ఉప ప్రణాళిక (సబ్ ప్లాన్)ను అమలుచేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్రం మొత్తం జనాభాలో 56.36 శాతానికి పైగా ఉన్న బీసీల కోసం ప్రత్యేకంగా ఉప ప్రణాళిక (సబ్ ప్లాన్)ను అమలుచేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీసీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. బడ్జెట్ పద్దులపై శనివారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా సభ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బీసీ సంక్షేమ శాఖకు రూ.12,511 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. అర్హులైన ప్రతీ బీసీ విద్యార్థికి ఉపకారవేతనాలు అందిస్తామని ప్రకటించారు. బీసీ హాస్టళ్ల నిర్మాణం కోసం బడ్జెట్‌లో రూ.434 కోట్లు ప్రతిపాదించినట్లు తెలిపారు. ‘మా నాయకుడు రాహుల్ గాంధీ చెప్పినట్టుగా రాష్ట్రంలో కుల గణన చేశాం. బీసీ గురుకులాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. విదేశీ విద్య కోసం బీసీ విద్యార్థులకు గతంలో 300 ఉపకార వేతనాలు మాత్రమే ఇచ్చేవారు. దానిని 700కుపెంచుతున్నాం. వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాల తెరిచే రోజు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్టూడెంట్ వెల్కమ్ కి ట్లు ఇస్తాం. ఇందులో పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌లు, యూనిఫాం, బెడ్‌షీట్, కార్పెట్, టవల్, దుప్పటి, బూట్లు, స్కూల్ బ్యాగ్, బెల్ట్, టై, ఐడీ కార్డు, స్టేషనరీ కిట్, ట్రాక్ సూట్, పీఈటీ డ్రెస్, నైట్ డ్రెస్, ప్లేట్, గ్లాస్, కటోరా, ట్రంక్ బ్యాగ్, ట్రాలీ బ్యాగ్ వంటి 20 రకాల వస్తువులు ఉంటాయి’ అని మంత్రి తెలిపారు.