Minister Ponnam Prabhakar: హుస్నాబాద్‌ను కరీంనగర్‌లో కలపడం ఖాయం
ABN , Publish Date - Jan 11 , 2026 | 03:38 AM
శాస్త్రీయ పద్ధతిలో జిల్లాల సరిహద్దుల మార్పులు, చేర్పులు చేపడితే హుస్నాబాద్ ప్రాంతాన్ని తిరిగి కరీంనగర్ జిల్లాలో కలపడం ఖాయమని రాష్ట్ర రవాణా...
హుస్నాబాద్‌రూరల్, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): శాస్త్రీయ పద్ధతిలో జిల్లాల సరిహద్దుల మార్పులు, చేర్పులు చేపడితే హుస్నాబాద్ ప్రాంతాన్ని తిరిగి కరీంనగర్ జిల్లాలో కలపడం ఖాయమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డలో శనివారం అర్బన్ పార్క్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి మాట్లాడారు. గతంలో కరీంనగర్ జిల్లాలో ఉన్న హుస్నాబాద్‌ను అప్పటి ప్రభుత్వం ప్రజల ఇష్టానికి విరుద్ధంగా సిద్దిపేట జిల్లాలో కలిపిందని విమర్శించారు. ఈ ప్రాంతం మళ్లీ కరీంనగర్‌లో చేరాలన్నదే ఇక్కడి ప్రజల ఆకాంక్ష అని పేర్కొన్నారు. గతంలో రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హుస్నాబాద్ పర్యటనలో ఇచ్చిన హామీని, ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేగా సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి తెలిపారు. జిల్లెలగడ్డ అర్బన్ పార్కును ఆనుకునే సర్వాయి పాపన్న కోటలు ఉన్నందున, దీనికి ‘సర్వాయి పాపన్న అర్బన్ పార్క్’ అని పేరు పెట్టాలని పొన్నం ప్రభాకర్ సూచించారు.