నాడు సికింద్రాబాద్‌ను ఎందుకు జిల్లా చేయలేదు
ABN , Publish Date - Mar 18 , 2026 | 05:08 AM
తెలంగాణ జిల్లాల పునర్విభజన సమయంలో సికింద్రాబాద్‌ను జిల్లాను నాటి బీఆర్‌ఎస్ సర్కారు ఏర్పాటు చేసి ఉంటే.. ఇప్పుడు మునిసిపల్ కార్పొరేషన్ అయ్యేదని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.
రాచకొండ కమిషనరేట్ పేరు పెట్టిందే బీఆర్‌ఎస్ సర్కారు
తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై విమర్శలా?:పొన్నం
తెలంగాణ జిల్లాల పునర్విభజన సమయంలో సికింద్రాబాద్‌ను జిల్లాను నాటి బీఆర్‌ఎస్ సర్కారు ఏర్పాటు చేసి ఉంటే.. ఇప్పుడు మునిసిపల్ కార్పొరేషన్ అయ్యేదని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఆ సమయంలో సికింద్రాబాద్‌ను ఎందుకు జిల్లాగా చేయలేదని మండి పడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)ని హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి నగర పాలక సంస్థలుగా మార్చిన ప్రభుత్వం సికింద్రాబాద్ పట్ల వివక్ష చూపిందని శాసనమండలిలో బీఆర్‌ఎస్ సభ్యుడు దాసోజు శ్రవణ్ ఆరోపించారు. దీనిపై మంత్రి పొన్నం స్పందిస్తూ.. ‘అప్పట్లో రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పేర్లను మీరే పెట్టారు’ అని వ్యాఖ్యానించారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపు రేఖల మార్పులపై దాసోజు శ్రవణ్ ఆరోపణలను తిప్పి కొట్టిన పొన్నం.. ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు అందరం వెళ్లామన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న నాటి ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ తల్లి రూపాన్ని ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. పల్లె ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ తల్లి, తెలంగాణ గీతాన్ని అధికారికంగా తీసుకొస్తే కువిమర్శలు చేస్తున్నారని మండి పడ్డారు.