Share News

ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి

ABN , Publish Date - Feb 01 , 2026 | 06:38 AM

మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించి ప్రజా ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు.

ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి

  • మున్సిపల్‌ ఎన్నికల్లో ఓట్లేసి గెలిపించండి

  • ఏదులాపురాన్ని మోడల్‌ మునిసిపాలిటీ చేస్తా

  • వర్ధన్నపేటలో ఆస్పత్రి కట్టించే బాధ్యత నాదే

  • మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి

ఖమ్మం, వర్ధన్నపేట, జనవరి 31 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించి ప్రజా ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. శనివారం ఖమ్మం జిల్లాలోని ఏదులాపురం మున్సిపాలిటీలో, వరంగల్‌ జిల్లా వర్ధన్నపేటలో జరిగిన కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి మాట్లాడారు. ఏదులాపురం మున్సిపాలిటీలోని పలు వార్డులో విస్తృతంగా పర్యటించి.. కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అసెంబ్లీ, లోక్‌సభ, పంచాయతీ ఎన్నికల్లో లాగే మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు. పదేళ్ల దొరల పాలనలో పేదలకు జరిగిన అభివృద్ధి ఏమీ లేదని, పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలన కమీషన్ల పాలనగా చరిత్రలో మిగిలిందని ధ్వజమెత్తారు. రూ. లక్షల కోట్ల మేర ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, ఇందుకు నిదర్శనమే కాళేశ్వరం ప్రాజెక్టు అని విమర్శించారు. ఏదులాపురం మునిసిపాలిటీని రాష్ట్రంలోనే మోడల్‌ మునిసిపాలిటీగా అభివృద్ధి చేస్తామని, మున్నేరుకు రక్షణ గోడలు పూర్తి చేసి ప్రజల వరద కష్టాలు తీర్చబోతున్నామని తెలిపారు. ఎఫ్‌సీఐ గోదాములను దూర ప్రాంతానికి తరలించి పురుగుల బెడద లేకుండా చూస్తామన్నారు. పాలేరు నియోజకవర్గానికి పెద్దకొడుకుగా అభివృద్ధికి అండగా ఉంటానని చెప్పారు. ప్రజా ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని, వర్ధన్నపేటలో 100 పడకల ఆస్పత్రి కట్టించే బాధ్యత తనదేనని అన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పారు. చేయవన్నారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో 80 శాతం స్థానాలను కాంగ్రెస్‌ జెండా ఎగరేయడం ఖాయమన్నారు. ఈ సందర్భంగా వర్ధన్నపేటలో వివిధ పార్టీల వారు మంత్రి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

Updated Date - Feb 01 , 2026 | 06:39 AM