Share News

Minister Ponguleti Reviews: కనీ వినీ ఎరుగని రీతిలో మేడారం జాతర నిర్వహణ

ABN , Publish Date - Jan 05 , 2026 | 03:11 AM

సుందర శిల్పాలతో సమ్మక్క-సారలమ్మ ఆలయ ప్రాంగణం గిరిజన సంస్కృతీ సంప్రదాయాల చిరునామాగా మారనున్నదని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి పేర్కొన్నారు.

Minister Ponguleti Reviews: కనీ వినీ ఎరుగని రీతిలో మేడారం జాతర నిర్వహణ

  • గిరిజన సంప్రదాయాల చిరునామా సమ్మక్క-సారలమ్మ గుడి

  • సీతక్కతో కలిసి వన దేవతలను దర్శించుకున్న పొంగులేటి

  • ఆలయ అభివృద్ధి, మహా జాతర ఏర్పాట్లపై కాంట్రాక్టర్లతో సమీక్ష

ములుగు/ఖమ్మం రూరల్‌, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): సుందర శిల్పాలతో సమ్మక్క-సారలమ్మ ఆలయ ప్రాంగణం గిరిజన సంస్కృతీ సంప్రదాయాల చిరునామాగా మారనున్నదని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి పేర్కొన్నారు. మంత్రి ధనసరి సీతక్క, ములుగు జిల్లా కలెక్టర్‌ దివాకరలతో కలిసి మంత్రి పొంగులేటి ఆదివారం వన దేవతలను దర్శించుకున్నారు. ఆలయ అభివృద్ధి, జంపన్న వాగు సుందరీకరణ పనులను పరిశీలించారు. అనంతరం వివిధ శాఖల అధికారులు, కాంట్రాక్టర్లతో సమావేశమై అభివృద్ధి పనుల పురోగతి, మహా జాతర ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ నెల 28-31 తేదీల మధ్య సమ్మక్క-సారలమ్మ మహా జాతరను చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించడానికి తమ ప్రభుత్వం సంకల్పించిందన్న పొంగులేటి.. ఈ నెల 12 కల్లా ఆలయ ప్రాకారం పిటిభీమ్స్‌ అమరిక, గద్దెల రాతిస్తంభాలపై బ్రాకెట్ల ఏర్పాటు, ఆలయ ప్రాంగణం నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ఆ తర్వాత ఏ కాంట్రాక్టర్‌ వాహనం ఉన్నా సీజ్‌ చేయాలని జిల్లా ఎస్పీ సుధీర్‌ ఆర్‌. కేకన్‌ను ఆదేశించారు. సంక్రాంతి పండుగకు ముందు నుంచే ఈ నెలాఖరు వరకూ మేడారం ప్రాంతం విద్యుత్‌ కాంతుల వెలుగులో భక్తులకు కనువిందు చేయాలని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. కాగా, ఆర్థిక ఇబ్బందులున్నా అభివృద్ధి పనులు చేపడుతూనే రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని మంత్రి పొంగులేటి అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పొంగులేటి.. సూర్యానగర్‌లో జరిగిన సభలో మాట్లాడుతూ.. పేదలకు మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. భవిష్యత్‌లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రూ.580 కోట్లతో మున్నేరు నదికి రిటైనింగ్‌ వాల్‌ యుద్ధ ప్రాతిపదికన రాబోయే వర్షాకాలం నాటికి పూర్తి చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

Updated Date - Jan 05 , 2026 | 03:11 AM