Share News

19 నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు

ABN , Publish Date - Jun 16 , 2026 | 04:54 AM

రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 19 నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో.. విపత్తుల నిర్వహణ యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని ....

19 నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు

  • విపత్తుల నిర్వహణ యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలి

  • ప్రభావిత జిల్లాల్లోజాగ్రత్తలు తీసుకోవాలి

  • మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశం

హైదరాబాద్‌, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 19 నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో.. విపత్తుల నిర్వహణ యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించాక స్పందించడం కంటే.. ముందుగానే తీవ్రతను అంచనా వేసి నిరోధక చర్యలు చేపట్టడం అత్యంత కీలకమన్నారు. నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయని.. రాబోయే నాలుగు రోజుల్లో తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఈ నెల 19 నుంచి వారం రోజులపాటు వర్షాలు కొనసాగవచ్చన్న వాతారణ శాఖ అంచనాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. సోమవారం ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. నైరుతి రుతుపవనాలు ఈ నెల 8వ తేదీన దక్షిణ తెలంగాణలో ప్రవేశించి.. జోగులాంబ గద్వాల జిల్లాను ఆవరించగా... ప్రస్తుతం హైదరాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల మీదుగా ఉత్తర సరిహద్దు వరకు కొనసాగుతున్నాయన్నారు. 14వ తేదీ నాటికి దక్షిణ తెలంగాణలో అన్ని జిల్లాలను, మధ్య తెలంగాణలోని చాలా జిల్లాలను రుతుపవనాలు తాకాయని వివరించారు. రాష్ట్రంలో జూన్‌ 1 నుంచి 15 వరకు సాధారణ వర్షపాతం 65 నుంచి 70 మి.మీ కాగా.. ఇప్పటి వరకు నమోదైనది 50 నుంచి 55 మి.మీ మాత్రమే. సాధారణంతో పోలిస్తే 20 శాతం లోటుందని మంత్రి తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికలను పరిశీలిస్తూ.. జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, విపత్తుల నిర్వహణ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వర్షాల తీవ్రత ఎక్కువ ఉండే ప్రాంతాలను గుర్తించి.. ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. కాగా రాబోయే రోజుల్లో ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ విశ్లేషకుల అంచనా. ముఖ్యంగా 18వ తేదీ తర్వాత నైరుతి రుతుపవనాల ప్రభావం పెరిగి, ఈ ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు పడే అవకాశముంది. హైదరాబాద్‌ విషయానికి వస్తే... వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా, 18వ తేదీ తర్వాత నగరంలో కూడా మంచి వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయని నిపుణులు వెల్లడించారు.

Updated Date - Jun 16 , 2026 | 04:55 AM