అర్ధరాత్రి ఆపదొస్తే.. పరుగులు తీసే అవస్థలుండవ్
ABN , Publish Date - Mar 06 , 2026 | 01:00 AM
అర్ధరాత్రి ఆపదొస్తే.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఖమ్మం పట్టణ కేంద్రానికి పరుగు తీయాల్సిన కష్టాలు ఈ ప్రాంత గిరిజన బిడ్డలకు ఇక ఉండవు.
తిరుమలాయపాలెంలో రూ.26 కోట్లతో 100 పడకల ఏరియా ఆసుపత్రికి శంకుస్థాపన
డిసెంబర్ కల్లా పనులు పూర్తి కావాలని నిర్దేశం : మంత్రి పొంగులేటి
హైదరాబాద్/తిరుమలాయపాలెం, మార్చి 5(ఆంధ్రజ్యోతి): ‘‘అర్ధరాత్రి ఆపదొస్తే.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఖమ్మం పట్టణ కేంద్రానికి పరుగు తీయాల్సిన కష్టాలు ఈ ప్రాంత గిరిజన బిడ్డలకు ఇక ఉండవు. పేదవాడి సొంత గడ్డపైనే కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించడమే మన ప్రజా ప్రభుత్వ లక్ష్యం’’ అని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గురువారం తిరుమలాయపాలెం మండల కేంద్రంలో సుమారు రూ. 26 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 100 పడకల ఆసుపత్రి భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. గతంలో కేవలం 30 పడకలతో, అరకొర వసతులతో ఉన్న ఈ ఆసుపత్రి వల్ల ప్రజలు పడ్డ ఇబ్బందులను మంత్రి గుర్తు చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘నాడు ప్రసవం అవ్వాలన్నా, అత్యవసర చికిత్స పొందాలన్నా ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లడం తప్ప మరో మార్గం ఉండేది కాదు. మా ప్రజా ప్రభుత్వం వచ్చాక, జిల్లా కేంద్ర ఆసుపత్రిని మరిపించేలా ఇక్కడ అన్ని వసతులూ కల్పిస్తున్నాం. డయాలసిస్ యూనిట్లు, అత్యాధునిక పరికరాలతో కూడిన వైద్యాన్ని రాబోయే కొద్ది నెలల్లోనే ఇక్కడ అందుబాటులోకి తెస్తాం’’ అని భరోసా ఇచ్చారు.
వైద్యులు దైవంతో సమానం.. ఇక్కడే ఉండాలి
వైద్య సిబ్బంది పనితీరుపై మంత్రి దిశానిర్దేశం చేశారు. ‘‘ప్రభుత్వం రూవందల కోట్లు ఖర్చు పెట్టి ఆసుపత్రి భవనాలు కట్టవచ్చు.. కానీ వాటిలో వైద్యులు అందుబాటులో ఉంటారనే నమ్మకం రోగికి కలిగినప్పుడే వాటికి సార్థకత ఉంటుంది. డాక్టర్లు, సిబ్బంది ఎక్కడో ఉండటం కాదు.. ఈ హెడ్ క్వార్టర్స్‌లోనే నివసించాలి. చర్ల, మణుగూరు, ఇల్లందు ప్రాంతాల్లో ప్రభుత్వ ఆసుపత్రులు అద్భుత ఫలితాలిస్తున్నాయి. ఇక్కడా అదే అంకితభావం కావాలి. విధుల్లో చిత్తశుద్ధి చూపే సిబ్బందికి నా నియోజకవర్గం తరపున ప్రత్యేక బహుమతులు అందజేస్తాను’’ అని ప్రకటించారు.
విద్య, వైద్యమే మా ప్రభుత్వ అజెండా
సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పేదవాడికి నాణ్యమైన చదువు, వైద్యం అందించడమే పరమావధిగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. ‘‘కేవలం వైద్యమే కాదు.. రాబోయే రోజుల్లో విద్యారంగంలోనూ విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. గడిచిన రెండేళ్ల మూడు నెలల్లోనే మౌలిక వసతుల కల్పనలో ఎంతో పురోగతి సాధించాం. ఈ ప్రభుత్వం ఎవరినీ నొప్పించదు.. కానీ ఉద్యోగులు బాధ్యతగా పనిచేసి ప్రజలకు ఫలితాలు అందించాలి’’ అని స్పష్టం చేశారు. ‘‘మార్చిలో పనులు మొదలవుతున్నాయి.. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి డిసెంబర్ నాటికి ఆసుపత్రిని ప్రారంభించాలి’’ అని కాంట్రాక్టర్‌కు గడువు విధించారు. అనంతరం మంత్రి పొంగులేటి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆరోగ్య శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.