‘క్యూర్’లో ఇందిరమ్మ ఇళ్లు!
ABN , Publish Date - Mar 17 , 2026 | 04:30 AM
కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన కార్యాచరణను సిద్ధం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ....
నిర్మాణానికి కార్యాచరణ సిద్ధం చేయండి ఊ
కేటాయించిన ఇంట్లో ఉండకపోతే ఇల్లు రద్దు
వాటిని అర్హులకే కేటాయించండి
అధికారులను ఆదేశించిన మంత్రి పొంగులేటి
మంత్రులు శ్రీధర్‌బాబు, అజారుద్దీన్, పొన్నంలతో కలిసి సమీక్ష
హైదరాబాద్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన కార్యాచరణను సిద్ధం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. క్యూర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని, హైదరాబాద్ నగరంలో నివసించే పేద ప్రజల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా స్థలాలను గుర్తించాలని సూచించారు. సీఎం రేవంత్ ఆలోచనలకు అనుగుణంగా పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, దానికి తగ్గట్టుగా అధికారులు పనిచేయాలని చెప్పారు. సోమవారం ఆయన మంత్రులు శ్రీధర్‌బాబు, అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్‌లతో కలిసి క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై సమీక్షించారు. క్యూర్ పరిధిలో మంజూరు చేయబోయే ఇళ్లకు, అలాగే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా చేయాలని, ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గవద్దని స్పష్టంచేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పొంది, వాటిని అద్దెకు ఇస్తున్నవారికి, ఏళ్ల తరబడి తాళాలు వేసి ఖాళీగా ఉంచుతున్న వారికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. స్పందించని వారి ఇళ్లను రద్దు చేసి, అర్హులైన పేదలకు కేటాయించాలని చెప్పారు. ఆయా పథకాల్లో ఇళ్లు పొంది, నివాసం ఉండని ఇళ్లను మే 1 నుంచి పరిశీలించి, నోటీసులు ఇవ్వాలని, స్పందించకపోతే కేటాయింపులను రద్దు చేయాలని తెలిపారు. నోటీసులకు స్పందించిన వారి దగ్గరి నుంచి తాము ప్రభుత్వం కేటాయించిన ఇంట్లోనే నివాసం ఉంటామని.. లేదంటే రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి అప్పగిస్తూ వారి నుంచి బాండు పేపరు మీద హామీ పొందాలని, ప్రభుత్వ నిబంధనలకు ఆమోదం తెలిపేలా ‘అండర్‌టేకింగ్’ కూడా తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. 4 జిల్లాల పరిధిలో ఉన్న కాలనీల్లో విద్యుత్తు, తాగునీరు, డ్రైనేజీ వంటి వసతులను తప్పనిసరిగా కల్పించాలని, ఈ విషయంలో జీహెచ్‌ఎంసీ సహకారం తీసుకోవాలని చెప్పారు. 22 వేల ఇళ్లకు కరెంటు మీటర్లను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ టవర్ల నిర్మాణం పూర్తయ్యేవరకు ఆగకుండా పూర్తయిన వాటిని ఎప్పటికప్పుడు లబ్ధిదారులకు కేటాయించాలన్నారు. వివిధ కాలనీల్లో ఉన్న వాణిజ్య సముదాయాలను వేలం పద్ధతిలో విక్రయించాలని, వాటి ద్వారా వచ్చిన డబ్బును అక్కడి సొసైటీ/ప్రభుత్వం పేరిట సంయుక్త ఖాతాను తెరిచి, అందులో జమ చేయాలని సూచించారు.