పాత అక్రెడిటేషన్ కార్డుల గడువు పొడిగింపు
ABN , Publish Date - Feb 23 , 2026 | 02:39 AM
జర్నలిస్టు సంఘాల ప్రతిపాదనల మేరకే అక్రెడిటేషన్ కమిటీలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు.
అర్హులందరికీ అక్రెడిటేషన్ కార్డులు జారీ చేస్తాం
టీయూడబ్ల్యూజే బృందానికి మంత్రి పొంగులేటి హామీ
ఖమ్మం, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జర్నలిస్టు సంఘాల ప్రతిపాదనల మేరకే అక్రెడిటేషన్ కమిటీలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. మరో నెల రోజులు పాత జర్నలిస్టు అక్రెడిటేషన్ల గడువు పొడిగిస్తున్నట్లు తెలిపారు. జర్నలిస్టు సంఘాలు సూచించిన వారికే అక్రెడిటేషన్ కమిటీలో ప్రాధాన్యం కల్పించాలని, జర్నలిస్టుల అక్రెడిటేషన్ సమస్యలతోపాటు వెబ్‌సైట్లు, కేబుల్ చానళ్లు, చిన్న పత్రికల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కె.రాంనారాయణ ఆధ్వర్యంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ప్రతినిధి బృందం మంత్రి పొంగులేటిని ఆదివారం కలిసి వినతిపత్రం అందజేసింది. 44,709 మంది జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు ఇస్తామన్న సర్కారు జారీ చేసిన జీవో ప్రకారం.. అందులో 50ు కార్డులు కూడా ఇచ్చే పరిస్థితి లేక పోవడంతో పాత్రికేయులు ఆందోళనకు గురవుతున్నారని తెలిపింది. దరఖాస్తులకు ఇచ్చిన వెబ్‌సైట్ ఫార్మాట్ కూడా సులభతరంగా లేదని ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై మంత్రి పొంగులేటి స్పందిస్తూ.. జర్నలిస్టులు ఆందోళన చెందవద్దని, అర్హులందరికీ అక్రెడిటేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు.