Share News

ఓఆర్‌ఆర్‌ లోపలా ఇళ్లు

ABN , Publish Date - Feb 18 , 2026 | 04:32 AM

ఓఆర్‌ఆర్‌ లోపల హైదరాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్‌జిల్లాల పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు.

ఓఆర్‌ఆర్‌ లోపలా ఇళ్లు

  • జాగా ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తాం

  • 28 వేల మందికి ఈ నెలాఖరున ఇళ్ల పత్రాలు అందజేస్తాం

  • ‘డబుల్‌ ఇళ్ల పూర్తికి చర్యలు

  • మార్చి నాటికి లబ్ధిదారుల ఎంపిక

  • ఆర్‌ఆర్‌ఆర్‌-ఓఆర్‌ఆర్‌ మధ్య చౌక ఇళ్లు: పొంగులేటి

  • మంత్రులతో కలిసి సమీక్ష

హైదరాబాద్‌, ఫిబ్రవరి 17(ఆంధ్ర జ్యోతి): ఓఆర్‌ఆర్‌ లోపల హైదరాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్‌జిల్లాల పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. కోర్‌ అర్బన్‌ పరిధిలో గృహ నిర్మాణ విధానంపై మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, అజారుద్దీన్‌లతో కలిసి మంగళవారం సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. కోర్‌ పరిధిలో మార్చి నాటికి ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేస్తామని ప్రకటించారు. మురికివాడల్లో ఇందిరమ్మ ఆదర్శ కాలనీలు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి స్థలాల సేకరణ, అసంపూర్తిగా ఉన్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపుపై అధికారుల నుంచి వివరాలు సేకరించారు. పట్టణంలోని మురికివాడల్లో జీవనం సాగించే పేదలు అక్కడే నివాసం ఉండేందుకు ఇష్టపడతారని, హైదరాబాద్‌ నగరానికి దూరంగా ఇళ్లు కట్టించి ఇచ్చినా జీవనోపాధి కోల్పోతామనే భయంతో మారేందుకు ఇష్టపడరని అధికారులు తెలిపారు. గతంలో హైదరాబాద్‌కు దూరంగా 42 వేల ఇండ్లు నిర్మిస్తే సగం కూడా లబ్ధిదారులు తీసుకోలేదని ప్రస్తావించారు. చాలాచోట్ల బోగస్‌ లబ్ధిదారులు ఉన్నారని వివరించారు.


మురికివాడల్లో అపార్ట్‌మెంట్ల నిర్మాణం

ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ప్రస్తుత నివాస ప్రాంతాలకు దగ్గరగా స్థానిక పరిస్థితులను బట్టి 5 నుంచి 10 అంతస్తుల భవనాలు నిర్మించాలని యోచిస్తున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. దీనిపై వచ్చే క్యాబినెట్‌లో తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. మూడు కార్పొరేషన్ల పరిధిలో అధికారులు అధ్యయనం చేసి స్థలాలు గుర్తించి, ఎంత మంది లబ్ధిదారులు ఉన్నారో, ఎన్ని ఇళ్లు నిర్మించవచ్చో పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. క్యూర్‌ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకంలో నిర్మించిన ఇళ్లు శిథిలావస్థకు చేరాయని, వాటి స్థానంలో కొత్త ఇళ్లు నిర్మించే ఆలోచన ఉందని చెప్పారు. మూడు కార్పొరేషన్ల పరిధిలో ఇళ్ల స్థలాలు ఉన్న 28 వేలమందికి ఈ నెలాఖరున ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేస్తామన్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల లబ్ధిదారులను మార్చి చివరి నాటికి ఎంపిక చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న ఇండ్లకు లబ్ధిదారులను గుర్తించి, వారి ద్వారానే అసంపూర్తి పనులు పూర్తి చేయించేందుకు హౌస్సింగ్‌ కార్పొరేషన్‌ నిధులు ఇస్తుందన్నారు. ఇళ్లు తీసుకుని నివాసం ఉండని వారికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. అనర్హుల స్థానంలో అర్హులైన పేదలకు ఇళ్లు ఇవ్వాలన్నారు. 2 బీహెచ్‌కే ఇళ్లకు తాగునీరు, విద్యుత్తు, ఇతర మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. ఆర్‌ఆర్‌ఆర్‌-ఓఆర్‌ఆర్‌ పరిధిలో మధ్య తరగతి ప్రజల కోసం కేపీహెచ్‌బీ తరహాలో ఇళ్లు నిర్మిస్తామని మంత్రి చెప్పారు. ఇందుకోసం నాలుగు ప్రాంతాల్లో స్థలాలు గుర్తించి పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అఫర్డబుల్‌ హౌస్సింగ్‌ విధానాన్ని తీసుకొస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఓఆర్‌ఆర్‌ ప్రాంత అపార్ట్‌మెంట్లలో ప్రస్తుతం సామాన్యులు ఇంటిని కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. దిగువ మద్యతరగతి ప్రజలకు సరసమైన ధరలు నివాసాలను అందించే దిశగా నూతన విధానాన్ని అమలు చేస్తామని మంత్రి తెలిపారు.


కోడ్‌ ఆడిటింగ్‌తో అక్రమాలకు చెక్‌: పొంగులేటి

కోడ్‌ ఆడిటింగ్‌పై భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) దృష్టి పెట్టాలని, అక్రమాలు జరగకుండా చూడాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ, సీసీఎల్‌ఏ అధికారులతో మంత్రి సచివాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఇటీవల వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లలో చలానాల కుంభకోణం జరగడానికి కూడా కోడ్‌ ఆడిటింగ్‌ లేకపోవడం ఒక కారణమని అధికారులు వివరించారు. కోడ్‌ ఆడిటింగ్‌ అంటే సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్‌లో ఉన్న సోర్స్‌ కోడ్‌ను జాగ్రత్తగా పరిశీలించి అందులో ఉన్న లోపాలను పసిగట్టాలి. భద్రతాపరమైన లోపాలు, పనితీరులో సమస్యలు, కోడింగ్‌ నిబంధనలు పాటించారా లేదా అనే అంశాలను ఎప్పటికప్పుడు పరిశీలించి పొరపాట్లు ఉంటే సరిదిద్దాలి. అయితే ధరణి పోర్టల్‌ నిర్వహించిన టెర్రాసిస్‌ సంస్థ ఆ పని చేయకపోవడంతో సాంకేతికపరమైన లోపాలను ఆసరా చేసుకుని అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నివేదికలో పేర్కొన్నారు. అయితే త్వరలో అందుబాటులోకి తీసుకురానున్న భూభారతి పోర్టల్‌లో కోడ్‌ ఆడిటింగ్‌ చేపట్టేలా పకడబ్బందీగా చర్యలు తీసుకోవాలని పొంగులేటి అధికారులకు సూచించారు.

Updated Date - Feb 18 , 2026 | 04:34 AM