దొంగ దారిలో కేంద్రం ఓట్ల వేట
ABN , Publish Date - Jun 13 , 2026 | 07:07 AM
కేంద్రంలో అధికారం చలాయిస్తున్న బీజేపీ ప్రతిపక్ష ప్రభుత్వాలే లక్ష్యంగా.. కుట్రలకు తెరలేపిందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ బలంగా ఉన్నచోట ఓట్ల తొలగింపునకు కుట్ర
కేంద్ర దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్ష ప్రభుత్వాలపై దాడి
మంత్రి పొంగులేటి ధ్వజం
ఖమ్మం రూరల్/తిరుమలాయపాలెం, జూన్ 12(ఆంధ్రజ్యోతి): కేంద్రంలో అధికారం చలాయిస్తున్న బీజేపీ ప్రతిపక్ష ప్రభుత్వాలే లక్ష్యంగా.. కుట్రలకు తెరలేపిందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధ్వజమెత్తారు. దొంగదారిలో ఓట్ల వేట సాగిస్తోందని ఆరోపించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమ గ్ర సవరణ(ఎస్‌ఐఆర్)పై టీపీసీసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం జిల్లా ఏదులాపురంలో పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ బూత్ స్థాయి ఏజెంట్లకు అవగాహన శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ బలంగా ఉన్న, పార్టీకి ఎక్కువగా ఓట్లు పడే చోట్ల దాదాపు 30-35ు ఓట్లను నకిలీవిగా చిత్రీకరించి, జాబితా నుంచి తొలగించేందుకు కేంద్రం పెద్ద కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఓటర్ల వయసులో స్వల్ప తేడాలున్నా, పేర్లలో తప్పులున్నా వాటన్నింటినీ వంక గా చూపి ఓట్లను లేపేసే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే బిహార్, వెస్ట్ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఇదే ఫార్ములాతో సఫలమయ్యారన్నారు. అదే ఇప్పుడు తెలంగాణలోనూ ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన ఆరోపించారు. కాగా ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లో 0.80 మెగావాట్ల సోలార్‌పవర్‌ప్లాంట్‌ను, విద్యుత్ నియంత్రణ మరమ్మతుల కేంద్రానికి మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు.