ఆరోపణలు రుజువు చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా
ABN , Publish Date - Jun 17 , 2026 | 04:54 AM
గురుకుల విద్యాసంస్థల కొనుగోళ్ల టెండర్లలో అవినీతి జరిగిందంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని...
గురుకుల కొనుగోళ్లలో పారద ర్శకంగా ప్రక్రియ
అవినీతి ఎన్ని కోట్లో బీఆర్‌ఎస్ నేతలే స్పష్టత ఇవ్వాలి
హరీశ్, ప్రవీణ్‌లకు మంత్రి లక్ష్మణ్ కుమార్ సవాల్
హైదరాబాద్, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): గురుకుల విద్యాసంస్థల కొనుగోళ్ల టెండర్లలో అవినీతి జరిగిందంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, వాటిని ఆధారాలతో నిరూపిస్తే.. ప్రజల సమక్షంలోనే పదవికి రాజీనామా చేస్తానని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సవాల్ విసిరారు. మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గురుకులాల టెండర్ల అంశంపై బీఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావు రూ.2వేల కోట్ల కుంభకోణమని, ప్రవీణ్‌కుమార్ రూ.3వేల కోట్లని, వారి మీడియా రూ.200 కోట్లంటూ ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నోటికి వచ్చినట్లు మాట్లాడటం సరికాదని.. దమ్ముంటే ఒక్క ఫైల్ లేదా ఒక్క చెల్లింపు వివరాన్ని ఆధారంగా చూపించాలని డిమాండ్ చేశారు. టెండర్ల ప్రక్రియ అంతా సీఎం రేవంత్‌రెడ్డి, ముగ్గురు మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారుల సమక్షంలో పారదర్శకంగా ఈ-ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్ ద్వారా జరిగిందని మంత్రి స్పష్టం చేశారు. కేంద్రీకృత కొనుగోలు విధానాన్ని హైకోర్టు సమర్థించిందన్నారు. విద్యార్థులకు అవసరమైన 27 రకాల వస్తువులకు టెండర్లు పిలిచి, పోటీ ప్రక్రియ ద్వారా చర్చలు జరిపి ధరలను తగ్గించామని తెలిపారు. బెడ్డింగ్ మెటీరియల్ కోసం రూ.70.86 కోట్లు, ట్రంక్ బాక్సులకు రూ.41.40 కోట్లు, ప్లేట్లు, గ్లాసుల సెట్‌కు రూ.18.36 కోట్లు కేటాయించామని, యూనిఫాం క్లాత్ వర్క్ ఆర్డర్ విలువ రూ.298.10 కోట్లని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ టీజీఎస్‌సీఓకు రూ.57.17 కోట్ల విలువైన వస్త్ర సరఫరా బాధ్యతలు అప్పగించామన్నారు. ఎక్కడైనాఅధిక ధరలు వచ్చాయని భావిస్తే.. నోట్‌బుక్, ట్రాలీ బ్యాగ్ వంటి టెండర్లను రద్దుచేసి ప్రభుత్వ రంగ సంస్థలకు లేదా జిల్లా స్థాయి కొనుగోళ్లకు బదిలీ చేశామని చెప్పారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యాసంస్థలు ప్రారంభమైన తర్వాత సెప్టెంబర్, అక్టోబర్‌లలో పుస్తకాలు, యూనిఫాంలు అందేవని మంత్రి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సకాలంలో వస్తువులు అందిస్తుంటే.. ఓర్వలేక బురద జల్లుతున్నారని మంత్రి లక్ష్మణ్‌కుమార్ ధ్వజమెత్తారు.