Minister Komatireddy Venkata Reddy: ఇంకా కసి తీరకపోతే నాకు విషమిచ్చి చంపండి
ABN , Publish Date - Jan 11 , 2026 | 03:49 AM
నా కుమారుడు ప్రతీక్ మృతితోనే సగం కుంగిపోయా. అయినా.. ఆ బాధ నుంచి తేరుకుని, ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయాల్లో ఉంటున్నా. అంతేతప్ప...
మానసికంగా వేధించడం ఎందుకు!?
తప్పుడు ప్రసారాలపై కోమటిరెడ్డి ఫైర్
రాజకీయమే తప్ప నాకు వేరే ఉద్దేశాల్లేవ్
మహిళా ఐఏఎ్‌సలపైనా ప్రసారాలు
సర్కార్‌ను అప్రదిష్ఠపాలు చేసేందుకే..
మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆక్రోశం
20 రోజుల్లోనే చర్యలని స్పష్టీకరణ
టికెట్ల ధర పెంపునకు సంతకం చేయలేదన్న మంత్రి
హైదరాబాద్, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): ‘‘నా కుమారుడు ప్రతీక్ మృతితోనే సగం కుంగిపోయా. అయినా.. ఆ బాధ నుంచి తేరుకుని, ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయాల్లో ఉంటున్నా. అంతేతప్ప.. నాకు వేరే ఉద్దేశాలు లేవు. నాకు రాజకీయమే తప్ప.. వ్యాపారాలు లేవు. ప్రతీక్ ఫౌండేషన్ పేరుమీద పేదలకు సాయం చేస్తున్నా. కానీ, కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాల్లో ఇటీవల ఇష్టమొచ్చినట్టు ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవినే త్యాగం చేసిన వ్యక్తిని. నాపై తప్పుడు ప్రసారాలు చేసే వారికి ఇంకా కసి తీరకపోతే.. నాకు విషం ఇచ్చి చంపండి. అంతేగానీ, మానసికంగా వేధించడం ఎందుకు!? నాలాంటి వాడిని వేధించి మీరు సాధించేది ఏంటి!?’’ అంటూ రాష్ట్ర రోడ్లు-భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి తీవ్రస్థాయిలో ఆక్రోశం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్ధరాత్రి దాటాక బైక్‌పై వెళ్లారని, సీఎంవోలో మహిళ తిరుగుతోందని, ఇన్‌చార్జి మంత్రులపై కూడా ఆధారాల్లేని కథనాలను ఇటీవల ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాజాగా నల్లగొండ మంత్రిగా తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఇలాంటి వాటిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇటీవలి కాలంలో వచ్చిన ఈ రకమైన కథనాలపై డీజీపీ శివధర్ రెడ్డితో మాట్లాడానని, వీటిని ఎవరు రాయిస్తున్నారనే దాంతోపాటు వివిధ కోణాల్లో విచారణ చేసి, నివేదిక ఇవ్వాలని కోరానని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారాన్ని 20 రోజుల్లో తేల్చి న్యాయపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం, సీఎం, మంత్రులు, ఐఏఎ్‌సలపై కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై శనివారం బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రాజకీయ నాయకులుగా మాపై ఎలాంటి కథనాలు వచ్చినా తట్టుకోగలం. కానీ, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపైనా ఇష్టారీతిన ప్రసారం చేస్తున్నారు. పైగా మహిళా ఐఏఎ్‌సల మీద ఇష్టమొచ్చినట్టు కథనాలు ఇస్తున్నారు. ఇది ఎంతవరకూ సమంజసమో ఆయా సంస్థలే ఆత్మ విమర్శ చేసుకోవాలి.
మహిళా ఐఏఎ్‌సలు పని చేయకూడదా!? వాళ్లు ఉద్యోగాలు చేస్తే తప్పా!?’’ అంటూ ధ్వజమెత్తారు. మహిళా ఐఏఎ్‌సలపై ఇటువంటి ప్రచారాలను వారి కుటుంబాలు తట్టుకోగలవా అని నిలదీశారు. ఐఏఎస్/ ఐపీఎస్ కావాలంటే ఆషామాషీగా సాధ్యం కాదని, ఎంతో మేధావులైతేనే ఆ స్థాయికి రాగలుగుతారని, అలా కష్టపడి వచ్చిన అధికారుల పట్ల ఇష్టమొచ్చినట్టు ప్రచారం చేయడం సరి కాదని తప్పుబట్టారు. జిల్లాల్లో పనిచేసిన ఐఏఎ్‌సలు, మంత్రులపై తప్పుడు కథనాలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. అందరికీ కుటుంబాలు ఉంటాయని, ఇలాంటి కథనాలతో మానసికంగా ఇబ్బందులకు గురి చేయడం సరి కాదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయన్నారు. ‘‘నాకు దేవుడు, ప్రజలపై చాలా నమ్మకం ఉంది. ఆ నమ్మకమే నన్ను 6 సార్లు ప్రజాప్రతినిధిగా గెలిపించింది. నా ఫోన్ నంబరు కొన్ని వేలమంది దగ్గరుంది. 24 గంటలూ నా పీఏ ఆ ఫోన్‌లో అందరికీ అందుబాటులో ఉంటాడు. నిజం చెప్పాలంటే, ఆ ఫోనే నన్ను గెలిపిస్తూ వస్తోంది. అలాంటిది నా ఫోన్‌ను ఇంట్లో వాళ్లు తీసుకున్నారని కూడా రాశారు. ఇది ఎంతవరకు సమంజసం’’ అని ప్రశ్నించారు. కాగా, జిల్లాల్లో పనిచేసే కలెక్టర్ల బదిలీల అంశం మంత్రుల పరిధిలో ఉండదని, పరిపాలనా సౌలభ్యానికి వీలుగా ముఖ్యమంత్రి ఈ వ్యవహారాన్ని చూసుకుంటారని చెప్పారు. ఈ బదిలీలు మంత్రులకు తెలియకుండానే జరుగుతుంటాయన్నారు. ఒకచోట నుంచి మరోచోటికి బదిలీ అయిన అధికారుల గురించి కట్టుకథలు ప్రచారం చేయడంపై సదరు సంస్థలే ఆలోచించుకోవాలన్నారు. ఇలాంటి కథనాలను వ్యూస్ కోసం ప్రసారం చేయకూడదని, రేటింగ్‌ల కోసం ఆరాటపడకూడదని హితవు పలికారు. ‘‘నాకు దేవుడిపై నమ్మకం ఉంది. నేను తప్పు చేస్తే ఆ దేవుడు నన్నే శిక్షిస్తాడు. ఒకవేళ వాళ్లు తప్పు చేస్తే వాళ్లనే శిక్షిస్తాడు’’ అని మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి కథనాలతో ప్రభుత్వాన్ని అప్రదిష్ఠపాలు చేయాలని చూస్తున్నట్టుగా అనిపిస్తోందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. విలువలు దిగజారి మరీ మీడియా సంస్థలు కథనాలను ప్రసారం చేయడంపై విచారం వ్యక్తం చేశారు. పోలీసుల విచారణ పూర్తయ్యాక, అవసరమైతే అవాస్తవాలు, ఊహజనిత కథనాలను ప్రసారం చేసిన సంస్థలపై దావా కూడా వేస్తామని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా చర్యలు ఉంటాయన్నారు. తప్పుడు కథనాలను ఇకనైనా ఆపాలని విజ్ఞప్తి చేసిన మంత్రి.. జర్నలిజం పట్ల బాఽధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.
మహిళా ఐఏఎ్‌సపై అసత్య కథనాలు.. బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందే
ఏఐఎస్ అధికారుల సంఘాల డిమాండ్
మహిళా ఐఏఎస్ అధికారిని లక్ష్యంగా చేసుకుని కొన్ని మీడియా సంస్థలు చేసిన అసత్య ప్రచారాన్ని తెలంగాణ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎ్‌ఫఎస్ అధికారుల సంఘాలు తీవ్రంగా ఖండించాయి. అసత్య కథనాలు ప్రసారం చేసిన మీడియా సంస్థ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫాంలోని కంటెంట్‌ను తొలగించాలని, సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన మీడియా మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశాయి. అటువంటి అసత్య ప్రచారాలపై ఉపేక్షించేది లేదని, చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించాయి. మహిళా అధికారుల వ్యక్తిత్వ హననానికి పాల్పడటం అత్యంత హేయమైన చర్యగా ఐఏఎస్ అధికారుల సంఘం అధ్యక్షుడు రామకృష్ణారావు, కార్యదర్శి జయేష్ రంజన్, ఐపీఎస్ అధికారుల సంఘం అధ్యక్షుడు శివధర్ రెడ్డి, కార్యదర్శి విక్రం సింగ్ మాన్, ఐఎ్‌ఫఎస్ అధికారుల సంఘం అధ్యక్షుడు రామలింగం, కార్యదర్శి ప్రియాంక వర్గీస్ వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. మహిళా అధికారులు చిత్తశుద్ధి, నిజాయితీ, మెరుగైన వృత్తి నైపుణ్యంతో సమాజం కోసం పని చేస్తున్నారని, ఇలాంటివారిపై దిగజారుడు కథనాలను ప్రసారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.
సినిమా టికెట్ల ధరల పెంపు ఫైళ్లు నాకు పంపొద్దని చెప్పా
ఆయా ఫైళ్లపై నేను సంతకాలు చేయట్లేదు
సినీ కార్మికుల సంక్షేమమే నాకు ముఖ్యం: మంత్రి వెంకటరెడ్డి
‘‘సినిమా టికెట్ల ధరల పెంపు ఫైళ్లను నాకు పంపొద్దని సినిమా వాళ్లకి గతంలోనే చెప్పా. వాటి కోసం నా దగ్గరకు రావద్దన్నా. ధరల పెంపు ఫైళ్లపై నేను సంతకాలు చేయడం లేదు. సినీ కార్మికుల సంక్షేమమే నాకు ముఖ్యం. పేద కళాకారుల విషయంపై మాత్రమే మాట్లాడతా. సినీ ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం లేదు’’ అని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. తాజాగా రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ సినిమాలకు పెంచిన టికెట్ ధరల విషయం తనకు తెలియదని స్పష్టం చేశారు. అసలు టికెట్ల ధరల పెంపు విషయంలో ఏం జరుగుతోందో కూడా తనకు తెలియదని తేల్చి చెప్పారు. పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర చోటు చేసుకున్న ఘటనలో మహిళ మృతి చెందినప్పటి నుంచి బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు అంశంపై తాను మాట్లాడడం లేదన్నారు. ఆ ఘటన చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఘటనతో ఆస్పత్రిలో చేరిన బాలుడి చికిత్స కోసం సినిమా ప్రొడ్యూసర్ ఆ సమయంలో స్పందించకపోవడంతో.. తమ ప్రతీక్ ఫౌండేషన్ నుంచి రూ.20 లక్షల చెక్ ఇచ్చానని చెప్పారు.