Share News

నేను విద్యాశాఖ మంత్రినైతే..కార్పొరేట్‌ పాఠశాలలను బంద్‌ చేయిస్తా

ABN , Publish Date - Jan 28 , 2026 | 03:49 AM

తాను విద్యాశాఖ మంత్రినైతే కార్పొరేట్‌ స్కూళ్లను బంద్‌ చేయిస్తానని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. కార్పొరేట్‌ స్కూళ్ల యాజమాన్యాలు విచక్షణ లేకుండా దోచుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్య వ్యాపారం కాదని పేర్కొన్నారు

నేను విద్యాశాఖ మంత్రినైతే..కార్పొరేట్‌ పాఠశాలలను బంద్‌ చేయిస్తా

  • టీచర్ల పిల్లలను సర్కారీ బడుల్లో చదివించాలి

  • ఆరోగ్యం సహకరిస్తేనే వచ్చే ఎన్నికల్లో పోటీ

  • రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి

  • 8 కోట్ల వ్యయంతో ప్రతీక్‌ ఫౌండేషన్‌ కట్టిన స్కూల్‌ భవనాన్ని ప్రారంభించిన మంత్రి

నల్లగొండ, జనవరి 27 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): తాను విద్యాశాఖ మంత్రినైతే కార్పొరేట్‌ స్కూళ్లను బంద్‌ చేయిస్తానని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. కార్పొరేట్‌ స్కూళ్ల యాజమాన్యాలు విచక్షణ లేకుండా దోచుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్య వ్యాపారం కాదని పేర్కొన్నారు. తన కుమారుడు కోమటిరెడ్డి ప్రతీక్‌రెడ్డి పేరుతో ఏర్పాటైన ప్రతీక్‌ ఫౌండేషన్‌ సమకూర్చిన రూ.8కోట్ల నిధులతో నల్లగొండలోని బొట్టుగూడలో పునర్నిర్మించిన కోమటిరెడ్డి ప్రతీక్‌ ప్రభుత్వ ప్రాథమిక, హైస్కూల్‌ భవనాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. విద్యతోనే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో అధిక ఫీజులతో దోచుకుంటున్నారని, అంతా దొంగలేనని, విద్య వ్యాపారం కావద్దన్నారు. ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించి మార్పు తీసుకురావాలని సూచించారు. ఇక, తనకు ఆరోగ్యం సహకరిస్తేనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తానని, లేకపోతే రాజకీయాలు విరమించుకుని ఇక్కడే ఈ పాఠశాలలోనే విద్యార్థులను చదివిస్తానని చెప్పారు. నల్లగొండను కార్పొరేషన్‌ చేశానని, కేంద్రం నుంచి నిధులు తెచ్చి పట్టణ రూపురేఖలు మారుస్తానని వెల్లడించారు. తాను ప్రధాని మోదీని కలిస్తే వెయ్యి, రూ.2వేల కోట్ల నిధులైనా ఇస్తారని చెప్పారు. నిధుల మంజూరులో కొడంగల్‌తో పోటీ పడుతూ నల్లగొండను సూపర్‌ స్మార్ట్‌సిటీగా మారుస్తానని ప్రకటించారు.

Updated Date - Jan 28 , 2026 | 03:49 AM