మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో..నల్లగొండలోని డివైడర్‌పై ఆక్రమణల తొలగింపు
ABN , Publish Date - Feb 18 , 2026 | 06:41 AM
నల్లగొండ జిల్లా కేంద్రంలోని వాణిజ్య కేంద్రం ప్రకాశం బజార్‌లో ఆక్రమణలు, ట్రాఫిక్ ఇబ్బందుల పరిష్కారంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టి సారించారు.
3 గంటల పాటు మంత్రి అక్కడే ఉండి పర్యవేక్షణ
నల్లగొండ, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): నల్లగొండ జిల్లా కేంద్రంలోని వాణిజ్య కేంద్రం ప్రకాశం బజార్‌లో ఆక్రమణలు, ట్రాఫిక్ ఇబ్బందుల పరిష్కారంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టి సారించారు. మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటలకు తానే నేరుగా రంగంలోకి దిగారు. జిల్లా ఎస్పీ, అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు), మునిసిపల్ సిబ్బంది, పోలీసు బలగాలను అక్కడికి పిలిపించారు. రెండు ఎక్స్‌కవేటర్లను తెప్పించి ప్రకాశం బజార్‌లో రోడ్డు నడిమధ్యలో ఉన్న డివైడర్‌ను, దానిని ఆక్రమించి చిరు వ్యాపారులు సుమారు అర కిలోమీటరు మేర ఏర్పాటు చేసుకున్న డబ్బాలు, షెడ్లను తొలగింపజేయించారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న చిరు వ్యాపారులను మంత్రి సముదాయించి వారికి నచ్చజెప్పారు. వారందరికీ సమీపంలోనే ఉన్న పాత మునిసిపాలిటీ కార్యాలయం వద్ద దుకాణాల ఏర్పాటుకు అవసరమైన స్థలాలను ఒక్కొక్కరికి 100గజాల వరకు ఇప్పిస్తానని, ఎవరూ ఆందోళనచెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. డివైడర్ ఆక్రమించి ఇరువైపులా షెడ్లు, దుకాణాలు ఏర్పాటు చేసుకుని కూరగాయలు, పండ్లు, పూలు, వంటి వ్యాపారాలు నిర్వహించటంతో వాహనాలు రాకపోకలకు ఇబ్బంది ఏర్పడిందని ఆయన తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకే డివైడర్ సహా ఆక్రమణలు తొలగింపజేయిస్తున్నామని వివరించారు.