ఎన్‌హెచ్‌ఏఐ నిబంధనల మేరకే..హ్యామ్ రోడ్ల మొబిలైజేషన్ అడ్వాన్సులు
ABN , Publish Date - May 03 , 2026 | 05:28 AM
హైబ్రిడ్ యాన్యుటీ మోడల్(హ్యామ్) రోడ్ల విషయంలో కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) నిబంధనలు...
వీటిని కాంట్రాక్టు సంస్థ నుంచి తిరిగి రికవరీ చేస్తారు: కోమటిరెడ్డి
హైదరాబాద్, మే 2 (ఆంధ్రజ్యోతి): హైబ్రిడ్ యాన్యుటీ మోడల్(హ్యామ్) రోడ్ల విషయంలో కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) నిబంధనలు, రాష్ట్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవోలోని నిబంధనల ప్రకారమే మొబిలైజేషన్ అడ్డాన్సులు చెల్లించామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. హ్యామ్ రోడ్లపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేహరీశ్‌రావు చేసిన ఆరోపణల నేపథ్యంలో శనివారం రాత్రి మంత్రి ఓ ప్రకటనలో వివరణ ఇచ్చారు. కేంద్ర రోడ్డు రవాణా, ఎన్‌హెచ్‌ఏఐ 2026లో హ్యామ్ రోడ్ల విధానాన్ని అమల్లోకి తెచ్చాయని, అప్పటి నుంచి ఇప్పటివరకు రూ.4-5 లక్షల కోట్ల విలువైన 374 ప్రాజెక్టులను ఈ విధానంలో చేపట్టాయని మంత్రి తెలిపారు. ఎన్‌హెచ్‌ఏఐ హ్యామ్ రోడ్ల విధానం ప్రకారం.. కాంట్రాక్టు సంస్థలు ఇచ్చే బ్యాంకు గ్యారెంటీల మేరకు 10ు మేర మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వవచ్చన్నారు. పైగా.. ఈ అడ్వాన్సులను బ్యాంకు వడ్డీలతో కలిపి కాంట్రాక్టు సంస్థల బిల్లుల నుంచి తిరిగి వసూలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. మొదటి దశ హ్యామ్ రోడ్ల టెండర్లను తెరవడం జరిగిందని, ఇందులో బిడ్డర్లు 15 నుంచి 23ు మేర ఎక్సె్‌సకు టెండర్లు వేసినట్లు గుర్తించామన్నారు. నిర్మాణ పనుల కాలంలో కాంట్రాక్టు సంస్థ వర్క్స్ కాంట్రాక్టుపై 18ు జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుందని, రహదారులపై ప్రతి 70 కిలోమీటర్లకు ఒక అంబులెన్సును 15 ఏళ్ల పాటు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇండిపెండెంట్ ఇంజనీర్(ఐఈ) చార్జీల కింద కాంట్రాక్టరు ఒక్క శాతం, ప్రభుత్వం ఒక్క శాతం చొప్పున చెల్లించాల్సి ఉంటుందన్నారు. కానీ.. ఇలాంటి వ్యయాలను కాంట్రాక్టు అంచనా వ్యయంలో చేర్చలేదన్నారు. ఈ కారణాల వల్లే కాంట్రాక్టు సంస్థలు ఎక్సెస్ టెండర్లు వేశాయన్నారు. ఇప్పటికే సాంకేతిక బిడ్లను పరిశీలించామని, ఆర్థిక బిడ్లు ఇంకా ఖరారు కాలేదని, ఇందులో ఎలాంటి తప్పిదాలు జరగలేదని వివరించారు.