Share News

మా హెచ్చరిక వల్లే విద్యుదుత్పత్తి నిలిపివేత: జూపల్లి

ABN , Publish Date - Apr 01 , 2026 | 05:09 AM

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రజా ప్రతినిధుల సంయుక్త హెచ్చరిక వల్లే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏపీ సర్కారు జల విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపివేసిందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.

మా హెచ్చరిక వల్లే విద్యుదుత్పత్తి నిలిపివేత: జూపల్లి

హైదరాబాద్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రజా ప్రతినిధుల సంయుక్త హెచ్చరిక వల్లే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏపీ సర్కారు జల విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపివేసిందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. గాంధీభవన్‌లో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే పరమావధిగా తమ సర్కారు పని చేస్తుందని స్పష్టం చేశారు. నీటిమట్టం కనీస స్థాయికి చేరుకున్నప్పుడు శ్రీశైలంలో జల విద్యుత్తును ఉత్పత్తి చేయరాదన్న నిబంధనను ఏపీ సర్కారు తుంగలో తొక్కి, తెలంగాణ అవసరాలను ఏమాత్రం పట్టించుకోకుండా నీటిని తోడేస్తుందని ఆరోపించారు. ప్రాజెక్టు నుంచి జల విద్యుత్తును ఉత్పత్తి చేయవద్దని ఎన్నిసార్లు విన్నవించుకున్నా.. ఏపీ సర్కారు తన మొండి వైఖరిని వీడలేదని అన్నారు. దీంతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రజా ప్రతినిధులందరం ఏకమై శ్రీశైలం వద్ద వంటావార్పు కార్యక్రమానికి పిలుపునిచ్చామన్నారు. తమ హెచ్చరికల తీవ్రతను గమనించిన ఏపీ సర్కారు.. శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్‌ కేంద్రం వద్ద విద్యుత్తు ఉత్పత్తి నిలిపివేసిందని మంత్రి జూపల్లి వివరించారు.

Updated Date - Apr 01 , 2026 | 05:09 AM