Minister Julapalli: పదేళ్లలో పాలమూరుకు ఏమిచ్చావు
ABN , Publish Date - Jan 03 , 2026 | 03:29 AM
పదేళ్లు సీఎంగా చేసిన కేసీఆర్.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఏమిచ్చారో సమాధానం చెప్పాలని మంత్రి జూపల్లి నిలదీశారు...
హైదరాబాద్, జనవరి 2(ఆంధ్రజ్యోతి): పదేళ్లు సీఎంగా చేసిన కేసీఆర్.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఏమిచ్చారో సమాధానం చెప్పాలని మంత్రి జూపల్లి నిలదీశారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్లు, పాలమూరు ప్రాజెక్టుకు రూ.27వేల కోట్లు వెచ్చించామని లెక్కలు చూపించినా.. పాలమూరు పథకంలో 25శాతం పనులను కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను అసంపూర్తిగానే వదిలేశారని మండిపడ్డారు. అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ మూసీ ప్రక్షాళన అంశంపై మాట్లాడేందుకు స్పీకర్ మైకు ఇవ్వలేదని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్ రావు.. ఈ సెషన్ మొత్తం బాయ్‌కట్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం రేవంత్‌పై బట్ట కాల్చి మీదేసే చందంగా హరీశ్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల తీరు ఉందని ధ్వజమెత్తారు. కృష్ణా జలాలు, పాలమూరు ప్రాజెక్టుపై చర్చ జరిగితే బండారం బయటపడుతుందనే.. బాయ్‌కాట్ పేరిట కుట్రకు తెరలేపారని ఆరోపించారు.