కేంద్ర నిధులు, అప్పుల మీద ఆధారపడట్లేదు
ABN , Publish Date - Feb 01 , 2026 | 06:42 AM
తెలంగాణ రాష్ట్రం కేవలం కేంద్రం ఇచ్చే నిధుల మీదో, అప్పుల మీదో ఆధారపడటం లేదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
వృద్ధిలో దూసుకుపోతున్నాం.. ప్రతిపక్షాల దుష్ప్రచారం సరికాదు
జాతీయ సగటు కంటే తెలంగాణ ద్రవ్యోల్బణమే తక్కువ
ఎకానమిక్ సర్వే 2025-26పై స్పందించిన మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రం కేవలం కేంద్రం ఇచ్చే నిధుల మీదో, అప్పుల మీదో ఆధారపడటం లేదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మన సొంత పన్ను వనరుల నుంచే అత్యధిక ఆదాయాన్ని గడించి, ఆర్థికంగా మనం ఎంత బలంగా ఉన్నామో కేంద్రం విడుదల చేసిన ఎకనామిక్ సర్వే ప్రపంచానికి చాటిచెప్పిందని తెలిపారు. ఇది తమ ప్రభుత్వ సమర్థతకు, పారదర్శకమైన ఆర్థిక నిర్వహణకు నిదర్శనమని పేరొన్నారు. శనివారం సచివాలయంలో కేంద్రం విడుదల చేసిన ఎకనామిక్ సర్వే 2025-26 అంశాలపై నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వార్షిక వృద్ధిలో తెలంగాణ ముందుకు దూసుకుపోతుంటే.. రాష్ట్రం వెనుకబడిందంటూ తమపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. తాము సంపదను సృష్టిస్తూ.. ప్రజల సంక్షేమానికి ఖర్చు చేస్తున్నామని, భావితరాల భవిష్యత్తు కోసం బాటలు వేస్తున్నామని పేర్కొన్నారు. ఐటీ, ఇన్నోవేషన్, ఏఐ రంగాల్లో తెలంగాణ ముద్రను చూసి ప్రపంచమే అబ్బురపడుతోందని చెప్పారు.
కేవలం గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల(జీసీసీ)కే పరిమితం కాకుండా, గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ దిశగా తెలంగాణ ఎదిగిందని కేంద్ర ఆర్థిక సర్వే తేల్చినట్లు తెలిపారు. ‘స్మార్ట్ ట్రైబల్ ఫార్మింగ్’ ద్వారా గిరిజన ప్రాంతాల్లోని రైతులకూ టెక్నాలజీని చేరువ చేసి, అట్టడుగు వర్గాల ఆర్థిక సాధికారతకు బాటలు వేయాలన్న తమ ప్రయత్నాన్ని ఈ సర్వే ప్రశంసించిందన్నారు. ఐటీ రంగంలో వెనుకబడ్డామంటూ తమపై దుష్ప్రచారం చేసిన వారు ఇప్పుడేం సమాధానం చెబుతారు? అని ప్రశ్నించారు. రెవెన్యూ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖలను సమన్వయం చేస్తూ ‘భూ భారతి’ పోర్టల్ ద్వారా భూ రికార్డుల నిర్వహణలో విప్లవాత్మక పారదర్శకతను తీసుకువచ్చామన్నారు. భూ యజమానుల హక్కులకు తమ ప్రభు త్వం ఇస్తున్న డిజిటల్ రక్షణను కేంద్రం అధికారంగా గుర్తించిందని వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో ‘విమర్శ’ అనేది ఒక ఆరోగ్యకరమైన సంప్రదాయమని, వ్యవస్థ మనుగడకు ఇది అవసరమని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్ర భుత్వం నిర్మాణాత్మక విమర్శలను ఎప్పుడూ స్వాగతిస్తోందని చెప్పారు.
సాధిస్తోన్న పురోగతికి ఈ సర్వేనే సాక్ష్యం
రాష్ట్రం అన్ని రంగాల్లో సాధిస్తున్న పురోగతి, ఆర్థిక వ్యవస్థ పనితీరు, పాలనలో పారదర్శకత, తమ ప్ర భుత్వ పనితీరుకు ‘ఎకానమిక్ సర్వే 2025-26’ ఒక తిరుగులేని సాక్ష్యం అని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొ న్నారు. అది కేవలం ఆర్థిక గణాంకాల పట్టిక కాదు, తెలంగాణ సర్వతోముఖాభివృద్థిని ప్రపంచానికి చాటిచెప్పే ప్రగతి నివేదికగా అభిప్రాయపడ్డారు. 2023- 24లో ద్రవ్యోల్బణం జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ.. 2024-25 నుంచి తెలంగాణ మెరుగైన పనితీరును కనబరిచిందన్నారు. 2024-25లో జాతీ య సగటు 4.63ు ఉంటే.. తెలంగాణలో 3.67 శా తంగా ఉందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (ఏప్రి ల్ - డిసెంబరు నాటికి) జాతీయ సగటు 1.72 శాతంగా ఉంటే.. తెలంగాణలో 0.20శాతంగా ఉన్న ట్లు ఈ సర్వే తేల్చిందని వివరించారు. ఇకనైనా బుర ద రాజకీయాలు మానుకుని ‘తెలంగాణ రైజింగ్’లో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు.