ఆ భేటీకి బహిరంగంగానే వెళ్లాం
ABN , Publish Date - Jan 28 , 2026 | 03:41 AM
ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తుల మధ్య జరిగే ప్రతి చర్చకు రాజకీయాలను ఆపాదిస్తూ...
ఇందులో దాచాల్సింది ఏమీ లేదు
రహస్యంగా అంటూ విష ప్రచారం వద్దు: మంత్రి దుద్దిళ్ల
హైదరాబాద్, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తుల మధ్య జరిగే ప్రతి చర్చకు రాజకీయాలను ఆపాదిస్తూ ‘రహస్య భేటీ’ అంటూ విష ప్రచారం చేయడం తగదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మంత్రుల భేటీపై సోషల్ మీడియా, కొన్ని ప్రసార మాధ్యమాల్లో జరగుతున్న ప్రచారాన్ని ఒక ప్రకటనలో ఆయన తీవ్రంగా ఖండించారు. లోక్‌భవన్‌లో ‘ఎట్ హోం’ కార్యక్రమం ముగిసిన తర్వాత అందరి ముందూ తామంతా ఒకే కారులో వెళ్లామని, ఇందులో దాచాల్సింది ఏమీ లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో క్యాబినెట్ అనేది ఒక యూనిట్ అని, పాలనలో జాప్యం లేకుండా చూసుకోవడం మంత్రుల సమష్టి బాధ్యత అని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో తాము పాలనాపరమైన అంశాలనే చర్చించామని తెలిపారు. ఈ భేటీలో ప్రధానంగా రాబోయే మున్సిపల్ ఎన్నికల సన్నద్ధత, పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపైనే చర్చ జరిగిందని వివరించారు. ఎన్నికల సన్నద్ధత అనేది రాజకీయ పార్టీల ప్రాథమిక బాధ్యత అని, దీనికి కూడా లేనిపోని రంగులు పూయడం సమంజసం కాదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకే కొందరు కావాలనే ఈ తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ఊహాజనిత కథనాలు, వ్యక్తిత్వ హననం ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని హెచ్చరించారు.