ఫుడ్ స్టాల్స్‌పై నిఘా: మంత్రి దామోదర
ABN , Publish Date - Jan 28 , 2026 | 03:38 AM
మేడారం జాతరలో భక్తులకు వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ఆ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.
వీలైతే సొంతంగా ఆహారాన్ని సిద్ధం చేసుకోవాలని భక్తులకు సూచన
హైదరాబాద్: మేడారం జాతరలో భక్తులకు వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ఆ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. భక్తులకు చిన్నపాటి అనారోగ్య సమస్యలొచ్చినా వెంటనే స్పందించి వైద్యం అందించేలా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. గద్దెల వద్ద ఏర్పాటు చేసిన 50 పడకల ఆస్పత్రి, మినీ హాస్పిటల్స్, ప్రధాన మెడికల్ క్యాంపుల్లో నిపుణులైన వైద్యులను నియమించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. జాతరలో ఏర్పాటు చేసిన మూడు ఆస్పత్రులు, 30 మెడికల్ క్యాంపులు, జాతరకు వెళ్లే ప్రధాన రోడ్లలో ఏర్పాటు చేసిన మరో 42 మెడికల్ క్యాంపుల్లో అందిస్తున్న వైద్యసేవలపై మంత్రి ఆరా తీశారు. మూడు ఆస్పత్రులు, 72 మెడికల్ క్యాంపుల్లో కలిపి 544 మంది డాక్టర్లు సహా మొత్తం 3199 మంది సిబ్బందిని నియమించామని మంత్రికి అధికారులు వివరించారు. అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచామని చెప్పారు. రోగులను తరలించడానికి 38 అంబులెన్స్‌లు, 40 బైక్ అంబులెన్స్‌లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. జాతరలో ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్‌పై నిఘా పెట్టాలని, నాసిరకం ఆహార పదార్థాలను విక్రయించే షాపులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. భక్తులకు మంత్రి జాతర శుభాకాంక్షలు చెబుతూ వీలైతే ఆహారాన్ని సొంతంగా సిద్ధం చేసుకోవాలని కీలక సూచన చేశారు.