అభివృద్ధి అంటే అంతస్తులు కాదు
ABN , Publish Date - Feb 25 , 2026 | 01:42 AM
వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విషయంలో మాజీమంత్రి హరీశ్‌రావు చేసిన విమర్శలను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఖండించారు.
ఎన్నికల ముందు అడ్డగోలుగా జీవోలిచ్చారు
సిబ్బంది లేకుండానే ఆస్పత్రులు ఏర్పాటు చేశారు
మీ తప్పుల్ని మేం సరిదిద్దుతున్నాం
హరీశ్‌రావు వ్యాఖ్యలను ఖండించిన మంత్రి దామోదర
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విషయంలో మాజీమంత్రి హరీశ్‌రావు చేసిన విమర్శలను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఖండించారు. అభివృద్ధి అంటే కేవలం అద్దాల మేడలు, బహుళ అంతస్తుల భవనాలు కాదని, హాస్పిటళ్లు అంటే కేవలం పేపర్ల మీద జీవోలు ఇచ్చి, స్లాబులు వేస్తే సరిపోదని మంత్రి చురకలంటించారు. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. హాస్పిటల్ అంటే పూర్తిస్థాయిలో భవనాలు ఉండాలని, వందల సంఖ్యలో డాక్టర్లు, సిబ్బంది, ఎక్వి్‌పమెంట్ సహా అన్ని రకాల సదుపాయాలు ఉంటేనే వైద్యం అందించగలుగుతామన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల్ల పాలనలో దెబ్బతిన్న ప్రజారోగ్య వ్యవస్థను తాము చక్కదిద్దుతున్నామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేనాటికి వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు కనీసం 50 శాతం కూడా పూర్తికాలేదన్నారు. హాస్పిటల్ బిల్డింగ్‌కోడ్‌ను ఉల్లంఘించి, కేవలం ప్రచార ఆర్భాటం కోసం 24 అంతస్తుల స్లాబులు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్డింగ్ ప్లానులో 3 నెలలకోసారి మార్పు చేస్తూ వచ్చారని, కట్టడం, కూల్చడమే పనిగా పెట్టుకుని.. నిర్మాణాన్ని ఆలస్యం చేస్తూ పోయారని మంత్రి మండిపడ్డారు. ఈ హాస్పిటల్ కు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేయించి, త్వరలో ప్రారంభించబోతున్నామన్నారు.