Share News

త్వరలో మరో 2,929 పోస్టుల భర్తీ

ABN , Publish Date - Mar 30 , 2026 | 05:17 AM

ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లపై పనిభారాన్ని తగ్గించేలా వైద్య సేవలు, పరిపాలనాపరమైన బాధ్యతలను విభజిస్తామని మంత్రి దామోదర తెలిపారు.

త్వరలో మరో 2,929 పోస్టుల భర్తీ

  • బోధనాస్పత్రుల్లో ఎంఆర్‌ఐ సేవలు: మంత్రి దామోదర

హైదరాబాద్‌, మార్చి 29(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లపై పనిభారాన్ని తగ్గించేలా వైద్య సేవలు, పరిపాలనాపరమైన బాధ్యతలను విభజిస్తామని మంత్రి దామోదర తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత 9,572 పోస్టులను భర్తీ చేశామని, ప్రస్తుతం మరో 7,267 పోస్టుల నియామక ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. త్వరలో వైద్య శాఖలో మరో 2,929 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేయనున్నామని తెలిపారు. బడ్జెట్‌ పద్దులపై ఆయన మాట్లాడారు. పైసా ఖర్చు లేకుండా ప్రతి పౌరుడికీ నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. తెలంగాణ ఆరోగ్య సూచికలు దేశ సగటుతో పోలిస్తే మెరుగ్గా ఉన్నాయని వివరించారు. ఆరోగ్యశ్రీ కింద రెండేళ్లలో సుమారు 9.5 లక్షల మందికి ఉచిత వైద్య సేవలు అందించామన్నారు. రాష్ట్రంలో మరో 79 డయాలసిస్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది చివరికల్లా టిమ్స్‌లు, వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రాబోయే రోజుల్లో సెకండరీ స్థాయి ఆస్పత్రుల్లో 5 పీజీ సెంటర్లను ఏర్పాటు చేస్తామని, దీంతో జిల్లాల్లో స్పెషలిస్ట్‌ వైద్యుల లభ్యత పెరుగుతుందని చెప్పారు. ఈ ఏడాది చివరికల్లా టిమ్స్‌లు, వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. బోధనాస్పత్రుల్లో ఈ ఏడాది మరో 11 సీటీ స్కాన్‌ యంత్రాలు, 8 హాస్పిటళ్లలో ఎంఆర్‌ఐ సేవలు ప్రారంభిస్తామని తెలిపారు. నగరాల్లో ప్రత్యేక వైద్య సేవలు అందించడానికి 145 పాలీక్లినిక్స్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో 7 సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

ఆ నియోజకవర్గాల్లోనే బిల్లులు : రాజగోపాల్‌ రెడ్డి

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాలా తీయిస్తే.. తమ ప్రజాప్రభుత్వం సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో పరిస్థితిని చక్కదిద్దుతూ పథకాల అమల్లో ముందుకు వెళ్తోందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. అయితే సరైన పర్యవేక్షణ కరువై విద్యా, వైద్య రంగాలతో పాటు ఇరిగేషన్‌, రహదారుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. డిండి ప్రాజెక్టుకు సంబంధించిన ముఖ్యమైన పనులు చేయకుండానే రిజర్వాయర్‌ కట్టి నాటి ప్రభుత్వం చేతులు దులుపుకుందని, ఉదయ సముద్రం ప్రాజెక్టుకు సంబంధించి కాలువల పని పూర్తి కాకపోవడంతో రైతులకు నీళ్లు ఇవ్వలేని స్ధితి ఉందన్నారు. వీటికి నిధులు కేటాయించాలని కోరారు. తమ నియోజకవర్గంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంలేదని.. కేవలం సీఎం, మంత్రుల నియోజకవర్గాల్లోనే బిల్లుల చెల్లింపు, పనులు పూర్తి అవుతున్నాయన్నారు.

Updated Date - Mar 30 , 2026 | 05:17 AM