రేషన్‌లో నిత్యావసర వస్తువులు
ABN , Publish Date - Jan 23 , 2026 | 04:24 AM
రేషన్ షాపుల్లో ఉచిత బియ్యంతోపాటు ఇతర నిత్యావసర వస్తువులు పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని...
ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే అందజేస్తాం
డిఫాల్టర్లకు సీఎంఆర్ ఇచ్చేది లేదు: ఉత్తమ్
హైదరాబాద్, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): రేషన్ షాపుల్లో ఉచిత బియ్యంతోపాటు ఇతర నిత్యావసర వస్తువులు పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే ఈ పథకాన్ని అమలులోకి తీసుకొస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఖరీఫ్ ధాన్యం సేకరణ పూర్తయిన నేపథ్యంలో పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులతో గురువారం హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు ప్రశంసా పత్రాలు అందించారు. ధాన్యం సేకరణలో సమస్యలను అధిగమించటానికి పలు మార్గదర్శకాలతో కూడిన బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క సీజన్‌లో 70,71 లక్షల టన్నుల ధాన్యం సేకరణ చేపట్టడం, 15 లక్షల మంది రైతులకు రూ.19 వేల కోట్ల నగదు బదిలీ చేయటం ద్వారా గడిచిన 25 ఏళ్లలో చేపట్టిన ధాన్యం సేకరణలో ఈ ఖరీఫ్ సీజన్ రికార్డులు సృష్టించిందని పేర్కొన్నారు. గతంలో ధాన్యం అమ్ముకొని డిఫాల్టర్లుగా మారిన రైస్‌మిల్లర్లకు సీఎంఆర్ కోటా ఇచ్చేదిలేదని స్పష్టం చేశారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో 863 మంది డిఫాల్టర్లకు ధాన్యం ఇవ్వలేదని, యాసంగిలో కూడా ఇచ్చేది లేదని ఉత్తమ్ స్పష్టం చేశారు.