దళిత విద్యార్థులకు ఢిల్లీ తరహా సివిల్స్ కోచింగ్
ABN , Publish Date - Feb 27 , 2026 | 04:33 AM
సివిల్స్ కోచింగ్ కోసం తెలంగాణ విద్యార్థులు ఢిల్లీ బాట పట్టాల్సిన అవసరం లేకుండా అక్కడ అందే సివిల్స్ కోచింగ్ సౌకర్యాలు హైదరాబాద్‌లోనే అందించే దిశగా...
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడి
హైదరాబాద్, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): సివిల్స్ కోచింగ్ కోసం తెలంగాణ విద్యార్థులు ఢిల్లీ బాట పట్టాల్సిన అవసరం లేకుండా అక్కడ అందే సివిల్స్ కోచింగ్ సౌకర్యాలు హైదరాబాద్‌లోనే అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. 59 దళిత కులాల సంఘాల నాయకులతో కలిసి మంత్రి లోయర్ ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్ భవన్, కాచిగూడలోని ఎస్సీ హాస్టల్‌ను సందర్శించారు. అంబేద్కర్ భవన్‌ను అధునాతన కోచింగ్ హబ్‌గా అభివృద్థి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కాచిగూడ హాస్టల్ కాంప్లెక్స్‌ను రెసిడెన్షియల్ అకడమిక్ సెంటర్‌గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, రిటైర్డ్ సివిల్ సర్వెంట్స్‌ను గెస్ట్ లెక్చర్స్‌గా తీసుకోవడంతోపాటు మాక్ టెస్టులు, ఇంటర్వ్యూ గైడెన్స్, పర్సనాలిటీ డెవల్‌పమెంట్‌పై ప్రత్యేక శ్రద్థ పెడతామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు అడ్మిషన్‌లో ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని మంత్రి తెలిపారు. కోచింగ్ సెంటర్లను ప్రతి జిల్లాకు విస్తరించేలా ప్రణాళిక చేస్తామని మంత్రి తెలిపారు.
కాళేశ్వరంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం
కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని మంత్రి అడ్లూరి విమర్శించారు. ప్రాజెక్టు పేరుతో గత ప్రభుత్వం కమీషన్లు దండుకుంటే.. ఆ అప్పులపై తమ ప్రభుత్వం ప్రతినెలా అసలు, వడ్డీ కింద రూ. 6 వేల కోట్ల వాయిదాలు చెల్లిస్తోందన్నారు. కాళేశ్వరం విషయంలో ప్రజలకు సమాధానం చెప్పాల్సింది మాజీ సీఎం కేసీఆరేనన్నారు.