అధికారం ఎవరిదైనా మా దగ్గరికి రావాల్సిందే
ABN , Publish Date - Feb 10 , 2026 | 04:22 AM
రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ఎవరు సీఎం అయినా ఎంఐఎం దగ్గరికి రావాల్సిందేనని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నెహ్రూ నుంచి మోదీ వరకూ ముస్లింలు, దళితులకు మోసం
మోసంలో మోదీ బడేభాయ్.. రేవంత్ చోటేభాయ్
మా మద్దతుతోనే జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలుపు
కరీంనగర్‌లో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ
భగత్‌నగర్, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ఎవరు సీఎం అయినా ఎంఐఎం దగ్గరికి రావాల్సిందేనని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మునిసిపల్ ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా సోమవారం కరీంనగర్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ మిగతా పార్టీలు, రెడ్లు, రావులు ఖర్చు చేసినంత చేయలేదేమో కానీ, ఎంఐఎంకు ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా అండగా ఉంటారన్నారు. సీఎంలు ఎవరొచ్చినా ఒవైసీ సోదరుల వద్దకు ఎందుకు వస్తారో ఒకసారి ఆలోచించాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీతో తాము కలవకుంటే జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఆ పార్టీ గెలుపు సాధ్యమయ్యేది కాదని అక్బరుద్దీన్ చెప్పారు. అసెంబ్లీలో తమ ఉనికి ఉంటేనే పనులు జరుగుతాయన్న అక్బరుద్దీన్.. రాజకీయం తమకు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పారు. ఎంఐఎం అంటే బీజేపీకి భయమని, ఆ పార్టీకి మత రాజకీయాలు తప్ప మరొకటి చేత కాదన్నారు. ముస్లింలకు టికెట్లు కేటాయించి మతతత్వ ముద్ర తొలగించుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. నెహ్రూ నుంచి మోదీ వరకూ ముస్లింలు, దళితులను మోసం చేశారన్న అక్బరుద్దీన్.. ప్రజలను మోసగించడంలో మోదీ బడేభాయ్.. రేవంత్ చోటేభాయ్ అని అభివర్ణించారు. ఎంఐఎం దయాదాక్షిణ్యాలతో గెలుపొందిన గంగుల.. ఈనాడు అదే ఎంఐఎంని విమర్శించడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. గంగుల ఓ భూకబ్జాదారుడని, 55 ఎకరాల వక్ఫ్‌భూమిని కబ్జా చేశారని, ఆ భూమిని తిరిగి సాధించింది ముస్లింలకు బహుమతిగా ఇస్తామన్నారు. మునిసిపల్ కార్పొరేషన్‌తోపాటు 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ గడ్డపై ఎంఐఎం జెండా ఎగురుతుందని అక్బరుద్దీన్ ప్రకటించారు.