Milk Booth Owner Attack: కీసరలో దారుణం
ABN , Publish Date - Jan 09 , 2026 | 05:21 AM
పాల బిల్లుల బకాయిలు చెల్లించాలని అడిగినందుకు ఓ మిల్క్ బూత్ నిర్వాహకుడు బరితెగించాడు. డెయిరీ మేనేజర్‌పై తల్వార్‌తో విచక్షణారహితంగా దాడి చేశాడు.
పాత బకాయిలు అడిగినందుకు..డెయిరీ మేనేజర్‌పై తల్వార్‌తో దాడి
మిల్క్ బూత్ నిర్వాహకుడి దుశ్చర్య
బాధితుడి పరిస్థితి విషమం
కీసర రూరల్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): పాల బిల్లుల బకాయిలు చెల్లించాలని అడిగినందుకు ఓ మిల్క్ బూత్ నిర్వాహకుడు బరితెగించాడు. డెయిరీ మేనేజర్‌పై తల్వార్‌తో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో డెయిరీ మేనేజర్ శ్రీనివాస్ తీవ్రంగా గాయపడగా, అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మేడ్చల్ జిల్లా కీసరలో గురువారం ఈ దారుణం చోటు చేసుకుంది. కీసర ఇన్‌స్పెక్టర్ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన శ్రీనివాస్.. ప్రస్తుతం హైదరాబాద్‌లోని మౌలాలీలో నివాసముంటూ దొడ్ల డైరీ స్టేట్ మేనేజర్ పనిచేస్తున్నాడు. కీసర చౌరస్తాలో దొడ్ల డెయిరీ మిల్క్‌బూత్ నిర్వహిస్తున్న కిరణ్ అనే వ్యక్తి కంపెనీకి రూ.35వేలు బాకీపడ్డాడు. ఈ విషయమై మాట్లాడేందుకు శ్రీనివాస్ గురువారం కీసరలోని మిల్క్‌బూత్‌కు వచ్చాడు. పాత బకాయిలు చెల్లిస్తేనే కొత్త స్టాక్ ఇస్తామని కిరణ్‌కు తేల్చి చెప్పాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. సహనం కోల్పోయిన కిరణ్.. తన దుకాణంలో ముందుగానే తెచ్చిపెట్టుకున్న తల్వార్‌ను తీసి శ్రీనివా్‌సపై దాడి చేశాడు. అతని మెడపై ఐదుసార్లు వేటు వేయడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. డెయిరీ కంపెనీ యాజమాన్యం ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. దాడికి పాల్పడిన కిరణ్ పరారయ్యాడని ప్రచారం జరిగినప్పటికీ, అతడు పోలీసుల అదుపులోనే ఉన్నట్లు సమాచారం.