Share News

‘రెరా’ నుంచి మాకు షోకాజ్‌ నోటీసు జారీ కాలేదు

ABN , Publish Date - May 12 , 2026 | 04:07 AM

హనుమకొండలోని ప్రశాంత్‌నగర్‌లో తాము నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్‌ నిర్మాణానికి సంబంధించి రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ...

‘రెరా’ నుంచి మాకు షోకాజ్‌ నోటీసు జారీ కాలేదు

  • అన్ని అనుమతులతోనే అపార్ట్‌మెంట్‌ నిర్మించాం

  • కొందరు కావాలనే బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు

  • వారిపై కాజీపేటలో కేసులు కూడా నమోదయ్యాయి

  • మిహిర బిల్డ్‌కాన్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ చాడా సుకేశ్‌రెడ్డి

హనుమకొండ, మే 11 (ఆంధ్రజ్యోతి) : హనుమకొండలోని ప్రశాంత్‌నగర్‌లో తాము నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్‌ నిర్మాణానికి సంబంధించి రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) నుంచి తమకు ఎటువంటి షోకాజ్‌ నోటీసు జారీ కాలేదని మిహిరా బిల్డ్‌కాన్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ చాడా సుకేశ్‌రెడ్డి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ‘రెరాకు మస్కాకొట్టి.. రూ.50 కోట్లతో అపార్ట్ట్‌మెంట్‌ కట్టి..’ అనే శీర్షికతో ఈ నెల 9న ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన వార్తకు ఆయన సోమవారం వివరణ ఇచ్చారు. కోర్టు కేసు విషయం తెలి యడంతో రిజిస్ట్రేషన్‌ నంబరును రెరా రద్దు చేశారనడంలో వాస్తవం లేదని అన్నారు. మిహిరా బిల్డర్స్‌... ‘రెరా’కు గానీ, ప్రభుత్వ యంత్రాంగానికి గాని ఎటువంటి తప్పుడు సమాచారం సమర్పించలేదని, అన్ని ప్రభుత్వ నిబంధనలకు లోబడి, మునిసిపల్‌ కార్పొరేషన్‌, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా), ‘రెరా’ అథారిటీ అనుమతులతోనే అపార్ట్‌మెంట్‌ నిర్మాణం చేపట్టిందని పేర్కొన్నారు. వూకంటి మహేందర్‌ రెడ్డి, అతడి బావ గొట్టం సంపత్‌కుమార్‌ రెడ్డి, భార్య గొట్టం శారద తప్పుడు ప్రకటనలు చేస్తూ డబ్బు కోసం బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు. వారిపై మిహిరా బిల్డర్స్‌ యాజమాన్యం కాజీపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసులు నమోదు చేసి కోర్టులో చార్జిషీట్‌ కూడా దాఖలు చేశారని తెలిపారు.మహేందర్‌ రెడ్డి ఆయన బంధువులు తమ బహుళ అంతస్థుల భవనంపై వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేయగా అప్పటి కమిషనర్‌ పమేల సత్పతి విచారణ జరిపి ఆ ఫిర్యాదును కొట్టివేస్తూ స్పీకింగ్‌ ఆర్డర్‌ (ప్రొసీడింగ్‌ నెం. సి1/1061/2017 తేదీ 25-04-2020) ద్వారా నిర్మాణానికి అనుమతి ఇచ్చారని వివరించారు. ఈ అనుమతిలో మిహిరా బిల్డర్స్‌ కట్టే స్థలం, కోర్టులో దావాలో ఉన్న స్థలం, దాని హద్దులు వేరు అని స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు. ఆ ఉత్తర్వులపై మహేందర్‌ రెడ్డి బంధువులు కోర్టుకు వెళ్లగా హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేసిందన్నారు. మహేందర్‌ రెడ్డి దాఖలు చేసిన ఫిర్యాదును ‘రెరా’ కొట్టివేసిందని, అలాగే ‘రెరా’ నుంచి తమకు ఎటువంటి షోకాజు నోటీసు జారీ కాలేదని తెలిపారు. ఇక ఫ్లాట్ల కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారనడంలో వాస్తవం లేదని, వారి నుంచి ఇప్పటివరకు తమకు ఎలాంటి అభ్యంతరాలూ రాలేదని సుకేశ్‌రెడ్డి తెలిపారు.

Updated Date - May 12 , 2026 | 04:07 AM