ఎంజీయూ ఉద్యోగుల వేతనాలు జమ
ABN , Publish Date - Apr 14 , 2026 | 12:37 AM
మహాత్మాగాంధీ యూనివర్సిటీలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న 113 మంది ఉద్యోగులకు యూనివర్సిటీ అధికారులు వేతనాలు చెల్లించారు.
రూ.14.50లక్షలు విడుదల చేసిన అధికారులు
ప్రత్యామ్నాయంగా ఇతర ఏజెన్సీ నుంచి చెల్లింపు
నల్లగొండ, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ యూనివర్సిటీలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న 113 మంది ఉద్యోగులకు యూనివర్సిటీ అధికారులు వేతనాలు చెల్లించారు. ‘తప్పు ఒకరిది శిక్ష ఒకరికి’ శీర్షికన ఈ నెల 12వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి ఎంజీయూ అధికారులు స్పందించారు. అదేరోజు రాత్రి ఉద్యోగులందరికీ వేతనాలు మంజూరు చేశారు. మొత్తం రూ.14.50లక్షలు ఉద్యోగుల ఖాతాలో జమ చేశారు. గతంలో ఉన్న ఒక ఏజెన్సీ నిర్వహకుడు కేంద్ర పన్నుల శాఖకు చెల్లించాల్సిన రూ.99లక్షల జీఎస్టీ రెండు సంవత్సరాలుగా చెల్లించకుండా కాలయాపన చేస్తూ వచ్చాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన ఎంజీయూ, జీఎస్టీ అధికారులు ఏజెన్సీ నిర్వాహకుడికి నోటీసులు జారీ చేశారు. నోటీసుల జారీతో సమస్య పరిష్కారం కాలేదు. గత నెలలో ఏజెన్సీ నిర్వాహకుడు సొంతంగా ఉద్యోగులకు వేతనాలు ఇచ్చి జీఎస్టీ ఎగవేసిన విషయం బయటకు రాకుండా చూసే ప్రయత్నం చేశాడు. ఎంజీయూ అధికారులు మార్చి నెల నుంచే ఏజెన్సీకి బిల్లులు చెల్లింపులు నిలిపివేశాడు. ఏప్రిల్‌లో రావాల్సిన వేతనాలు కూడా ఏజెన్సీకి యూనివర్సిటీ అధికారులు నిలిపివేయడంతో సమస్య జటిలంగా మారింది. ఏప్రిల్ నెల వచ్చి రెండు వారాలు కావొస్తున్నా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు రాని విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తేవడంతో యూనివర్సిటీ అధికారులు స్పందించి వేతనాలను కేటాయించారు.