Share News

ఉపాధి హామీ పథకం గడువు పొడిగింపు?

ABN , Publish Date - Apr 04 , 2026 | 04:52 AM

గ్రామీణులకు ఉపాధి కల్పిస్తున్న ‘మహాత్మాగాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం’ స్థానంలో కొత్త చట్టం తెచ్చిన కేంద్రం..

ఉపాధి హామీ పథకం గడువు పొడిగింపు?

  • ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలే కారణం!

  • వీబీ జీ రామ్‌ జీ అమలు వాయిదా

పెద్దపల్లి, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): గ్రామీణులకు ఉపాధి కల్పిస్తున్న ‘మహాత్మాగాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం’ స్థానంలో కొత్త చట్టం తెచ్చిన కేంద్రం.. దాని అమలును నెల రోజులు వాయిదా వేసినట్లు సమాచారం. పాత పథకానికి మార్పులు, చేర్పులు చేసి కేంద్రం తీసుకొచ్చిన ‘వికసిత్‌ భారత్‌- గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ అజివిక మిషన్‌ (వీబీ-జీ రామ్‌ జీ) పథకం ప్రకారం రాష్ట్రాలు 40 శాతం వాటా నిధులు కేటాయించాలి. కొత్త చట్టం ప్రకారం రాష్ట్రాలపై భారం మోపడాన్ని తెలంగాణ సహా పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే, ఈ నెలలో పశ్చిమ బెంగాల్‌, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీల ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో లబ్ధి పొందాలని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ‘వీబీజీ రామ్‌ జీ’ పథకాన్ని అమల్లోకి తెస్తే.. విపక్షాలు తమకనుకూలంగా మార్చుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు ప్రచారం చేసే అవకాశాలున్నాయని బీజేపీ భావిస్తోంది. దీంతో ఈ నెల వరకూ మహాత్మాగాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకమే కొనసాగించనున్నట్లు సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరా (2026-27)నికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ లేబర్‌ బడ్జెట్‌ను ఆమోదించలేదని తెలుస్తోంది. ఈ పథకం అమలుకు తాత్కాలికంగా 2 కోట్ల పని దినాలను కేంద్రం కేటాయించింది. వేసవిలో ఉపాధి హామీ పనులకు భారీగా కూలీలు హాజరయ్యే అవకాశాలుండటంతో కేంద్రం ఎక్కువ పని దినాలను కేటాయించినట్లు సమాచారం.

Updated Date - Apr 04 , 2026 | 04:52 AM