రాష్ట్ర ప్రభుత్వం వల్లే మెట్రో విస్తరణ ఆలస్యం
ABN , Publish Date - Jun 18 , 2026 | 06:08 AM
మెట్రో విస్తరణ ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆరోపించారు.
అవసరమైన సాంకేతిక పత్రాలను ఇవ్వకుండా కేంద్రం అడ్డుకుంటోందంటూ అవాస్తవాల ప్రచారం
మీడియాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్, జూన్ 17(ఆంధ్రజ్యోతి): మెట్రో విస్తరణ ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆరోపించారు. ధ్వజమెత్తారు. మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్టు, ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ రిపోర్టు, డీపీఆర్‌లను ఇప్పటి వరకు సమర్పించలేదన్నారు. అవసరమైన సాంకేతిక పత్రాలు ఇవ్వకుండా కేంద్రం అడ్డుకుంటోందంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుకు కేంద్రం వ్యతిరేకం కాదని, ఆ ప్రాజెక్టును తిరస్కరించలేదని స్పష్టం చేశారు. మెట్రో స్వాధీనానికి సంబంధించిన రుణం విషయంలోనూ కేంద్రం సూచనలు పాటించకుండా సీఎం రేవంత్ నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. మెట్రో రుణం మంజూరు, విస్తరణ ప్రాజెక్టు ఆలస్యానికి కేంద్రం గానీ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గానీ కారణం కాదని, ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధిపై ఆసక్తి లేదని, కేవలం స్కాములు, కమీషన్ల రాజకీయాలపైనే అనుభవం ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు తెలంగాణ అభివృద్ధికి కేంద్రం రూ.13లక్షల కోట్లు అందించిందన్నారు. అబద్ధాన్ని పదేపదే చెప్పి నిజమని నమ్మించే ‘గోబెల్స్’ తరహా ప్రచారాన్ని కాంగ్రెస్ చేస్తోందని విమర్శించారు. పాలనలో ఫెయిల్ అయిన కాంగ్రెస్ అబద్ధాల ప్రచారంలో పాస్ కావాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీపై నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవుపలికారు. కాగా, సినీ నిర్మాత బండి శ్రీనివాస్, నటి జ్యోతి రెడ్డి బీజేపీలో చేరడంపై రాంచందర్‌రావు హర్షం వ్యక్తం చేశారు.