Share News

ప్రాణాంతకంగా.. పురుషుల్లో రొమ్ము క్యాన్సర్‌

ABN , Publish Date - Mar 22 , 2026 | 06:08 AM

రొమ్ము క్యాన్సర్‌... అనగానే సహజంగా మహిళలకు వచ్చే జబ్బు అని చాలా మంది అనుకుంటారు. కానీ.. పురుషులు కూడా ఆ మహమ్మారి బారిన పడతారు.

ప్రాణాంతకంగా.. పురుషుల్లో రొమ్ము క్యాన్సర్‌

  • ఆలస్యంగా గుర్తించడం వల్ల పెరిగిపోతున్న ముప్పు

  • హైదరాబాద్‌ ఈఎస్ఐ డాక్టర్స్‌ అధ్యయనంలో వెల్లడి

హైదరాబాద్‌, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): రొమ్ము క్యాన్సర్‌... అనగానే సహజంగా మహిళలకు వచ్చే జబ్బు అని చాలా మంది అనుకుంటారు. కానీ.. పురుషులు కూడా ఆ మహమ్మారి బారిన పడతారు. దీనిపై అవగాహన లేకపోవడంతో.. పురుషుల్లో రొమ్ము క్యాన్సర్‌ ప్రాణంతకంగా మారుతోందని, సాధారణంగా పురుషులకు వచ్చే క్యాన్సర్లలో ఇవి ఒక శాతమే అయినప్పటికీ, జబ్బు ముదిరాక గానీ గుర్తించలేకపోవడ వల్ల తీవ్రత పెరుగుతోందని తాజా అధ్యయనంలో తేలింది. హైదరాబాద్‌లోని ఈఎ్‌సఐసీ వైద్య కళాశాల, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో 2019-2025 మధ్య నమోదైన కేసులను విశ్లేషించగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. అధ్యయనంలో భాగంగా.. రొమ్ము క్యాన్సర్‌ బారిన పడిన 15 మంది పురుషుల నేపథ్యాన్ని పరిశీలించారు. వీరంతా 31 నుంచి 74 ఏళ్లలోపువారు. వారి కుటుంబ సభ్యుల్లో ఎవరికీ క్యాన్సర్‌ లేదని పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. అలాగే వారు ఈస్ట్రోజన్‌ ప్రభావానికి, రేడియేషన్‌కు, క్యాన్సర్‌కారకాలకు గురి కాలేదని తేలింది. రొమ్ము క్యాన్సర్‌ బారిన పడినా కూడా, వారిలో ఎవరికీ దాని లక్షణాలపై ఎలాంటి అవగాహనా లేకపోవడంతో చాలా ఆలస్యంగా వైద్యుల వద్దకు వచ్చినట్టు తెలిసింది. ఫలితంగా చికిత్స అందే సమయానికి 60 శాతం మందిలో క్యాన్సర్‌ మూడో స్టేజ్‌కు, మరో 26.7 శాతం మందిలో నాల్గోదశకు చేరుకున్నట్లు పరీక్షల్లో తేలింది. మిగతా 13 శాతం మందే ప్రారంభ దశలో ఆ మహమ్మారి లక్షణాలను గుర్తించి, సకాలంలో వైద్యులను సంప్రదించారు. అలాగే.. వీరిలో 80 శాతం మందిలో హర్మోన్‌ రిసెప్టర్‌ పాజిటివిటీ, 40 శాతం మందిలో హెచ్‌ఈఆర్‌ 2 పాజిటివిటీ కనిపించినట్లు అధ్యయనంలో తేలింది. అత్యాధునిక మందులు, సర్జరీ, ఎండోక్రైన్‌ థెరపీ ద్వారా 60 శాతం మంది రోగులు ప్రస్తుతం కోలుకొని ఆరోగ్యంగా ఉన్నారని అధ్యయన నివేదిక వెల్లడించింది.


వాస్తవానికి పురుషుల్లో వచ్చే కాన్సర్స్‌లలో రొమ్ము క్యాన్సర్‌ కేసులు ఒక్క శాతంలోపే ఉంటాయని.. కానీ, పురుషులకు కూడా రొమ్ము క్యాన్సర్‌ వస్తుందన్న విషయం చాలా మందికి తెలియకపోవడంతో ముందుగా కనిపించే లక్షణాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, తెలుసుకునే సమయానికి దాని తీవ్రత పెరిగిపోతోందని వైద్యులు వివరించారు. స్త్రీలైనా, పురుషులైనా.. రొమ్ము క్యాన్సర్‌ బారిన పడితే వారి రొమ్ము మధ్య భాగంలో గడ్డలా తగలడం, చనుమొనలు వెనక్కి ముడుచుకుపోవడం, చర్మం రంగు మారిపోవడం వంటి ప్రధాన లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. వీటిని ముందస్తుగా గుర్తిస్తే తక్కువ ఖర్చుతో, మెరుగైన ఫలితాలు సాధించవచ్చని వారు పేర్కొంటున్నారు.


మగవారిలో రొమ్ము క్యాన్సర్‌ ఎందుకొస్తుంది?

హార్మోన్ల అసమతౌల్యం కారణంగా పురుషుల్లో రొమ్ము క్యాన్సర్‌ వచ్చే ముప్పు ఉందని గతంలో జరిగిన అధ్యయనాల ద్వారా తెలిసింది. అమ్మాయిలు యుక్తవయసుకు వచ్చినప్పుడు శరీరంలో సంభవించే మార్పులకు ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ అత్యంత కీలకమైనది. అందుకే దాన్ని స్త్రీ లైంగిక హార్మోన్‌ అంటారు. పురుషుల్లో కూడా ఈ హార్మోన్‌ కొద్దిమొత్తంలో ఉంటుంది. అది సాధారణ స్థాయులకు మించి పెరిగితే వారు రొమ్ము క్యాన్సర్‌ బారిన పడే ప్రమాదం పెరుగుతుంది. అలాగే లివర్‌ సమస్యలు, స్థూలకాయం, కొన్మి హార్మోన్‌ చికిత్సలు కూడా రొమ్ము క్యాన్సర్‌కు కారణమౌతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటికితోడు జన్యుపరమైన కారణాలు.. ముఖ్యంగా బీఆర్‌సీఏ1, బీఆర్‌సీఏ2 జన్యువుల్లో మార్పుల వల్ల దీని బారిన పడే ముప్పుంది. అలాగే ఛాతీ భాగానికి రేడియేషన్‌ తగలడం కూడా కొన్నిసార్లు రొమ్ము క్యాన్సర్‌ రావడానికి కారణమౌతుంది.

Updated Date - Mar 22 , 2026 | 06:09 AM