చిన్నారెడ్డిని సస్పెండ్ చేయండి
ABN , Publish Date - Aug 22 , 2026 | 05:17 AM
వనపర్తి కాంగ్రెస్‌లో కొద్దిరోజులుగా కొనసాగుతున్న అంతర్గత విభేదాలు ఢిల్లీకి చేరాయి. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఫిర్యాదు చేశారు.
డబ్బులిస్తే కాంగ్రెస్‌లో సీటు ఇస్తారని మాట్లాడుతున్నారు
ఖర్గేకు ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫిర్యాదు
న్యూఢిల్లీ/వనపర్తి, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): వనపర్తి కాంగ్రెస్‌లో కొద్దిరోజులుగా కొనసాగుతున్న అంతర్గత విభేదాలు ఢిల్లీకి చేరాయి. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఫిర్యాదు చేశారు. చిన్నారెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని.. ఆయన్ను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులతో కలిసి శుక్రవారం ఢిల్లీలో ఖర్గేకు లిఖితపూర్వక ఫిర్యాదును అందజేశారు. కాంగ్రెస్ సముచిత స్థానం కల్పించినప్పటికీ, ఆయన పార్టీ ప్రతిష్ఠను దిగజార్చేలా మాట్లాడుతున్నారని ఖర్గేకు మేఘారెడ్డి వివరించారు. ఇప్పటివరకు 8 సార్లు ఎమ్మెల్యే, ఓసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయనకు కాంగ్రెస్ అవకాశం కల్పించిందన్నారు. ప్రస్తుతం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా క్యాబినెట్ హోదా ఇచ్చినట్లు చెప్పారు. అయినప్పటికీ చిన్నారెడ్డి కాంగ్రెస్‌ను కించపరిచేలా.. డబ్బులు ఇస్తే కాంగ్రెస్‌లో సీటు ఇస్తారని మాట్లాడుతున్నారని ఖర్గే దృష్టికి తీసుకెళ్లారు. చిన్నారెడ్డి వ్యాఖ్యలపై ఇప్పటికే పార్టీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవికి, టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌కు ఫిర్యాదు చేసిన మేఘారెడ్డి.. శనివారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌లకు కూడా ఫిర్యాదు చేయనున్నారు.
‘కాంగ్రెస్ నుంచి 9 సార్లు బీఫామ్ తీసుకున్న చిన్నారెడ్డి పార్టీ పెద్దలకు ఎంత డబ్బు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నారో వనపర్తి ప్రజలకు సమాధానం చెప్పాలి. డబ్బులు ఇవ్వలేదని నిరూపించుకోగలిగితే మంచిదే. లేకపోతే వనపర్తి అంబేడ్కర్ చౌరస్తాకు వచ్చి ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని ఎమ్మెల్యే మేఘారెడ్డి వ్యాఖ్యానించారు. చిన్నారెడ్డిపై ఖర్గేకు ఫిర్యాదు చేసిన అనంతరం మేఘారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఖర్గే సానుకూలంగా స్పందించారని.. చిన్నారెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు, మీడియా క్లిప్పింగులను అధిష్ఠానానికి అందజేసినట్లు చెప్పారు. కన్న తల్లిలాంటి పార్టీనే విమర్శిస్తున్న చిన్నారెడ్డిని సస్పెండ్ చేసే వరకు పోరాడతానని స్పష్టం చేశారు.