ఏఐ మెదడు.. ఇన్‌ఫ్రా శరీరం
ABN , Publish Date - Jul 02 , 2026 | 04:29 AM
మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్).. భారత్‌లోకి తొలిసారిగా ఫిజికల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.
భారత్‌లోకి ఫిజికల్ ఇంటెలిజెన్స్ సేవలు
అనలాగ్‌తో మేఘా ఇంజనీరింగ్ జాయింట్ వెంచర్
వచ్చే 3-4 ఏళ్లలో రూ.4,750 కోట్ల పెట్టుబడులు
ట్రాఫిక్ నిర్వహణకు ఏఐని వాడండి
మేఘా ఎండీ, అనలాగ్ సీఈవోతో భేటీలో సీఎం
హైదరాబాద్ ట్రాఫిక్ పైలట్ ప్రాజెక్టు వివరాలను రేవంత్ రెడ్డికి తెలిపిన రెండు సంస్థల ప్రతినిధులు
హైదరాబాద్, బిజినెస్ డెస్క్, జూలై 1 (ఆంధ్రజ్యోతి): మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్).. భారత్‌లోకి తొలిసారిగా ఫిజికల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకోసం అబుదాబీ కేంద్రంగా ఉన్న టెక్నాలజీ సంస్థ ‘అనలాగ్’తో కలిసి ఎంఈఐఎల్ జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు బుధవారం ఇక్కడ ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో.. ఎంఈఐఎల్ మేనేజింగ్ డైరెక్టర్ పీవీ కృష్ణా రెడ్డి, అనలాగ్ వ్యవస్థాపకుడు, సీఈవో అలెక్స్ కిప్‌మన్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన తదుపరి తరం ఇంటెలిజెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫిజికల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరిష్కారాలు, హైదరాబాద్ ట్రాఫిక్ పైలట్ ప్రాజెక్టు వివరాల గురించి వారు ముఖ్యమంత్రికి వివరించారు. సెన్సర్లు, రోబోటిక్స్, ఫిజికల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో ట్రాఫిక్ రద్దీని ముందుగానే గుర్తించడం, సిగ్నళ్లను స్వయంచాలకంగా నియంత్రించడం, నీటి లీకేజీలను గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టడం, అవసరానికి అనుగుణంగా విద్యుత్ వినియోగాన్ని నిర్వహించడం, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలకు గ్రీన్ కారిడార్ కల్పించడం వంటివి సాధ్యమవుతాయని సీఎంకు తెలిపారు. కాగ్నిటివ్ సిటీస్ రూపకల్పనకు ఉన్న అవకాశాలను ఆయనకు వివరించగా.. రాజధాని హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిర్వహణకు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సాంకేతికతను వినియోగించాలని సీఎం వారికి సూచించారు. నగరంలోని అన్ని ట్రాఫిక్ సిగ్నళ్లనూ ఒకే వ్యవస్థలో అనుసంధానం చేసి, ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా స్వయంచాలకంగా పనిచేసే విధానాన్ని అమలు చేయాలన్నారు. వాతావరణ పరిస్థితుల్లో వచ్చే మార్పులను సైతం పరిగణనలోకి తీసుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేలా సాంకేతికతను ఉపయోగించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ప్రభుత్వ సలహాదారు కె.రామకృష్ణారావు, ఇన్వెస్ట్ సీఈవో, హైదరాబాద్ మెట్రో రైల్ అదనపు ఎండీ బి.అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పరిస్థితులకు తగ్గట్టుగా..
చెరి సగం భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ జాయింట్ వెంచర్ కోసం రానున్న మూడు నుంచి నాలుగేళ్లలో 30 కోట్ల డాలర్ల నుంచి 50 కోట్ల డాలర్ల (సుమారు రూ.2,850 కోట్ల నుంచి రూ.4,750 కోట్లు) వరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు ఎంఈఐఎల్ ఎండీ పీవీ కృష్ణారెడ్డి చెప్పారు. ఫిజికల్ ఇంటెలిజెన్స్‌లో.. యంత్రాలు కేవలం ప్రొగ్రామింగ్‌పై ఆధారపడకుండా, పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించడం, సముచిత నిర్ణయాలు తీసుకోవడం వంటి సామర్థ్యాలను కలిగి ఉంటాయని ఆయన తెలిపారు. పట్టణ ప్రాంతాలు ప్రధానంగా ఎదుర్కొంటున్న ట్రాఫిక్, సెక్యూరిటీ వంటి కీలకమైన సమస్యలను పరిష్కరించేందుకు ఫిజికల్ ఇంటెలిజెన్స్ ఎంతగానో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్ట్ ప్రాతిపదికన ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, విద్యుత్ గ్రిడ్ సామర్థ్యం పెంపుతో పాటు విద్య, ఆరోగ్య రంగాల్లో ఈ సొల్యూషన్స్‌ను వినియోగిస్తున్నామని.. వచ్చే మూడు నెలల్లో వీటిని వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నామని కృష్ణా రెడ్డి చెప్పారు. ఇక.. భారత అవసరాలకు తగ్గట్టుగా ఈ జాయింట్ వెంచర్ ప్రత్యేకంగా టెక్నాలజీ సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేయనుందని అనలాగ్ సీఈఓ అలెక్స్ కిప్‌మన్ వెల్లడించారు.
ఈవీ కార్ల తయారీలోకి మేఘా..
అంతర్జాతీయ భాగస్వామితో కలిసి ఎలక్ట్రిక్ కార్ల తయారీ అవకాశాలను ఎంఈఐఎల్ పరిశీలిస్తోందని కృష్ణా రెడ్డి తెలిపారు. గ్రూప్‌నకు చెందిన ఒలెకా్ట్ర గ్రీన్‌టెక్ ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సుల తయారీలో కీలకంగా ఉందని, అయితే ఈవీ కార్ల తయారీ మాత్రం బీవైడీతో కాదని ఆయన పేర్కొన్నారు. మూడు నెలల్లో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అలాగే సెల్, బ్యాటరీ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని చూస్తున్నట్లు వెల్లడించారు.
ఫిజికల్ ఇంటెలిజెన్స్ అంటే?
సాధారణంగా రోబోలు, యంత్రాలు.. ముందే రాసిన ప్రోగ్రామింగ్ ఆధారంగా పనిచేస్తాయి తప్ప వాటికి సొంతంగా ఆలోచించే సామర్థ్యం ఉండదు. ఉదాహరణకు.. ట్రాఫిక్‌సిగ్నల్స్‌నే తీసుకుంటే.. వాటిలో ఉండే టైమర్ల ప్రకారం 30 సెకన్లు లేదా 60 సెకన్లు ఇలా ఒక నిర్ణీత సమయంపాటు వెలుగుతాయి. అంతే తప్ప ఎటువైపు ట్రాఫిక్ ఎక్కువ ఉంది? ఎటువైపు వాహనాలను ఎక్కువసేపు వదలాలి? అని ఆలోచించి పనిచేయలేవు. అదే, ఫిజికల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటే అది రోడ్డుపై ఉండే కెమెరాలు, సెన్సర్ల ద్వారా ట్రాఫిక్‌ను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటుంది. అంబులెన్స్ వస్తున్నా.. ఒకవైపు ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగిపోయినా.. అది క్షణాల్లో గమనించి, దానికి అనుగుణంగా అటువైపు గ్రీన్ సిగ్నల్ సమయాన్ని పెంచుతుంది. అలాగే.. ఎండాకాలంలో ఏదైనా ప్రాంతంలో లోడ్ ఎక్కువైతే ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం, పవర్ కట్ కావడం వంటి ఘటనలు జరుగుతాయి. అదే, ఫిజికల్ ఇంటెలిజెన్స్ ఉంటే.. గ్రిడ్ సిస్టమ్ ఏ ప్రాంతంలో కరెంటు వాడకం అసాధారణంగా పెరుగుతోందో గమనిస్తుంటుంది. ఎక్కడైనా ట్రాన్స్‌ఫార్మర్ విఫలమయ్యే అవకాశం ఉంటే ముందే గమనించి అక్కడ లోడ్‌ను ఆటోమేటిగ్గా వేరే లైన్‌కి మారుస్తుంది. ఎక్కడైనా తీగలు తెగితే ఆ విషయాన్ని త్వరగా గుర్తిస్తుంది. ఇవేకాదు.. పరిశ్రమల్లో, వ్యవసాయంలో ఇలా పలు రంగాల్లో ఫిజికల్ ఇంటెలిజెన్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది.