Share News

‘సర్‌’ ముసాయిదాపై సభలు

ABN , Publish Date - Aug 27 , 2026 | 01:00 AM

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా పోలింగ్‌ కేంద్రాల పరిధిలో వార్డు సభలు, గ్రామ సభలను నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించి ముసాయిదా ఓటరు జాబితాలో నమోదైన ఓటర్ల పేర్లను బీఎల్‌వోలు అందరికీ చదివి

‘సర్‌’ ముసాయిదాపై సభలు

జగిత్యాల, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా పోలింగ్‌ కేంద్రాల పరిధిలో వార్డు సభలు, గ్రామ సభలను నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించి ముసాయిదా ఓటరు జాబితాలో నమోదైన ఓటర్ల పేర్లను బీఎల్‌వోలు అందరికీ చదివి వినిపించనున్నారు. జాబితాలో పేరు నమోదు కాకుండా మిగిలిపోయిన అర్హులైన పౌరులను గుర్తించనున్నారు. 2026 అక్టోబరు1 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకునే యువత తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకునేందుకు నిర్ణీత డిక్లరేషన్‌, అవసరమైన ధ్రువపత్రాలతో ఫారం-6 సమర్పించాల్సి ఉంటుంది. ముసాయిదా ఓటరు జాబితాలో పేరు, వయస్సు, చిరునామా, ఫొటో, ఇతర వివరాల్లో తప్పులు ఉన్నట్లయితే వాటి సవరణ కోసం డిక్లరేషన్‌, తగిన ఆధారాలతో ఫారం-8 సమర్పించాల్సి ఉంటుంది. అర్హత లేకపోయినప్పటికీ ఓటరు జాబితాలో నమోదైన వ్యక్తుల వివరాలను కూడా సభలో గుర్తించి, అలాంటి నమోదుపై అభ్యంతరం తెలిపే వ్యక్తి అదే శాసన సభ నియోజకవర్గానికి చెందిన ఓటరై ఉండి, నిర్ణీత ఫారం-7 సమర్పించాల్సి ఉంటుంది. క్లయిమ్‌లు, అభ్యంతరాలు, ధ్రువీకరణకు సంబంధించిన గడువు భారత ఎన్నికల సంఘం నిర్ధేశించిన అవసరమైన పత్రాలు, ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించిన ఇతర అంశాలపై సభల్లో అవగాహన కల్పించనున్నారు.

ఫ40,944 మంది మ్యాపింగ్‌ కాని ఓటర్లు

జిల్లాలో పలువురు ఓటర్లకు నోటీసుల జారీకి రంగం సిద్ధమైంది. ఓటర్ల వివరాలను గత రికార్డులతో అనుసంధానం చేసే క్రమంలో తేడాలు ఉన్నవారు, వివరాలు మ్యాపింగ్‌ కానివారు, ధ్రువీకరణ అవసరమైన వారిని గుర్తించారు. జిల్లాలో మొత్తం 1,92,962 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయనున్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 74,802 మంది లెక్కల్లో లేనివారిగా, 40,944 మంది మ్యాపింగ్‌ కానివారిగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. వీరితో పాటు చిరునామాలు, పేర్లు, ఇంటి నంబర్లు తదితర వాటిల్లో తప్పులు దొర్లిన ఓటర్లకు సైతం నోటీసులు అందించనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం గ్రామసభలు ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో కీలక ఘట్టంగా మారనున్నాయి.

ఫప్రజాభిప్రాయమే ప్రామాణికం

నోటీసులు అందుకున్న ఓటర్లు గ్రామసభకు హాజరయ్యేటప్పుడు తమ వద్ద ఉన్న సంబంధిత ధ్రువపత్రాలను వెంట తీసుకురావాల్సి ఉంటుంది. పేరు, వయస్సు, తండ్రి లేదా తల్లి పేరు, చిరునామా తదితర వివరాల్లో తేడాలు ఉంటే వాటిని సరిచేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. అవసరమైన ఆధారాలను పరిశీలించిన అనంతరం అధికారులు తదుపరి చర్యలు చేపట్టనున్నారు. ఓటరు జాబితాపై గ్రామసభల్లో ప్రజాభిప్రాయాన్ని ప్రామాణికంగా తీసుకోనున్నారు.

ఫనోటీసు వస్తే ఓటు రద్దు కాదు..

నోటీసు అందుకున్నంత మాత్రాన ఓటు హక్కు రద్దయినట్లు కాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఓటరు వివరాల్లో ఉన్న అనుమానాలు, వ్యత్యాసాలను ధ్రువీకరించేందుకే నోటీసులు జారీ చేస్తున్నట్లు చెబుతున్నారు. అర్హత ఉన్న ఓటర్లు సరైన ఆధారాలతో హాజరై తమ వివరాలను నిర్ధారించుకోవచ్చని సూచిస్తున్నారు. గత ఓటర్ల జాబితాలతో ప్రస్తుత జాబితాను అనుసంధానం చేసే సమయంలో కొందరి వివరాలు సరిపోలలేదు. మరికొందరి వివరాలు మ్యాపింగ్‌ కాలేదు. దీంతో ఇలాంటి ఓటర్లను ప్రత్యేకంగా గుర్తించి నోటీసులు ఇస్తున్నారు. కుటుంబ సభ్యుల వివరాలు, చిరునామా, వయస్సు తదితర అంశాలను కూడా పరిశీలించనున్నారు.

ఫగ్రామసభల్లోనే అభ్యంతరాలు..

గ్రామసభల్లో ప్రజల సమక్షంలో ఓటర్ల వివరాలను పరిశీలించడం వల్ల ప్రక్రియలో పారదర్శకత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఒకరి పేరు తప్పుగా తొలగించేందుకు ప్రయత్నం జరిగినా, అనర్హుడి పేరు కొనసాగుతున్నా గ్రామసభలో అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. దీంతో స్థానికంగా ప్రజల భాగస్వామ్యం కీలకం కానుంది.

ఫయువ ఓటర్లకూ అవకాశం..

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో అర్హత ఉన్న కొత్త ఓటర్ల నమోదుకు కూడా అవకాశం కల్పించనున్నారు. 18 ఏళ్లు నిండిన యువత ఓటరుగా నమోదు చేసుకోవడంతో పాటు, ఇప్పటికే ఓటరుగా ఉన్న వారి వివరాల్లో మార్పులు ఉంటే సవరణకు దరఖాస్తు చేసుకోవచ్చు. తప్పులు ఉన్న పేర్లు, చిరునామాలు సరిచేసుకునే అవకాశాన్ని అర్హులు వినియోగించుకోవాల్సి ఉంటుంది.

ఫఅధికారులకూ పరీక్షే..

జిల్లాలో సుమారు రెండు లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసే పరిస్థితి ఏర్పడడంతో ఎన్నికల యంత్రాంగంపై బాధ్యత పెరిగింది. గ్రామసభల్లో వచ్చే ప్రతి అభ్యంతరాన్ని నిష్పక్షపాతంగా పరిశీలించి, అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉండేలా చూడాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో అనర్హులు, డూప్లికేట్‌ పేర్లు కొనసాగకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. నోటీసులు అందుకున్న ఓటర్లు ఆధారాలతో హాజరవుతారా? గ్రామస్థాయి అభ్యంతరాలతో ఎన్ని పేర్లలో మార్పులు వస్తాయన్నది తేలాల్సి ఉంది.

ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగానే...

-సత్యప్రసాద్‌, కలెక్టర్‌

జిల్లాలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించనున్నాము. ఓటర్లు గ్రామ, వార్డు సభలను సద్వినియోగం చేసుకోవాలి. ఓటర్లు అధికారులను సంప్రదించి తమ సందేహాలను నివృత్తి చేసుకొని సమస్యలను పరిష్కరించుకోవాలి. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాము.

Updated Date - Aug 27 , 2026 | 01:00 AM