30లోగా కమిటీలు పూర్తిచేయండి
ABN , Publish Date - Jun 22 , 2026 | 04:12 AM
ఈ నెల 30కల్లా కాంగ్రెస్ పార్టీ మండల, గ్రామ కమిటీల ఏర్పాటు పూర్తి కావాలని లోక్‌సభ ఇన్‌చార్జిలను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్ ఆదేశించారు.
సర్ పట్ల అప్రమత్తంగా ఉండండి .. లోక్‌సభ ఇన్‌చార్జిల సమావేశంలో మీనాక్షి దిశానిర్దేశం
హైదరాబాద్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి) : ఈ నెల 30కల్లా కాంగ్రెస్ పార్టీ మండల, గ్రామ కమిటీల ఏర్పాటు పూర్తి కావాలని లోక్‌సభ ఇన్‌చార్జిలను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్ ఆదేశించారు. రాబోయే ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకమని, గ్రామస్థాయి నుంచీ పార్టీ బలోపేతంపైన దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే ఈ నెల 25 నుంచి కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన ఎస్‌ఐఆర్(సర్) ప్రక్రియ పట్లా అప్రమత్తంగా ఉండాలన్నారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీ నిర్మాణం కోసం చేపట్టిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం పురోగతి, సర్ ప్రక్రియపై ఆదివారంనాడు గాంధీభవన్‌లో లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జిలతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆమె ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మీనాక్షితో పాటుగా టీపీసీసీ చీఫ్ మహే్‌షగౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, లోక్‌సభ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల కమిషన్ చేపడుతున్న సర్ ప్రక్రియనే వచ్చే ఎన్నికల్లో ఓటర్లు ఎవరన్నది నిర్ణయిస్తుందని, ఈ నేపథ్యంలో ఆ ప్రక్రియ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. మహే్‌షగౌడ్ మాట్లాడుతూ.. బూత్ స్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయాలన్నారు. ప్రతి కార్యకర్త ప్రజలతో నిరంతరం మమేకం కావాలన్నారు. ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో మరింత చురుకుగా పనిచేయాలన్నారు. సర్ ప్రక్రియలో అర్హులైన ప్రతి ఓటరు పేరు నమోదు అయ్యేలా చూడాలన్నారు. ఓటు హక్కు పరిరక్షణలో కాంగ్రెస్ నాయకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?: మహేశ్‌గౌడ్
కాంగ్రెస్ ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలనలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి.. కేంద్రంలో బీజేపీ 12 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా..? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావుకు టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్ సవాల్ విసిరారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల కల్పన, విదేశాల నుంచి నల్లధనాన్ని తెచ్చి పేదల అకౌంట్లలో వేస్తామంటూ ఎన్నికల ముందు ప్రధాని మోదీ ఇచ్చిన హామీల అమలు గురించి రాంచందర్‌రావు మాట్లాడాలన్నారు. ఆయన తమకు ప్రధాని మోదీ సమయం ఇప్పిస్తే బీజేపీ మూడు ఎన్నికల మేనిఫెస్టోల్లో ఇచ్చిన హామీల అమలు గురించి అడుగుతామన్నారు. ఆ తర్వాత రాహుల్‌గాంధీ సమయం గురించి మాట్లాడవచ్చన్నారు. గాంధీభవన్‌లో ఆదివారంనాడు మీడియాతో ఈ మేరకు మాట్లాడారు. కాగా.. లంబాడాలకు ఎస్టీ రిజర్వేషన్లు అమలై 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 25 నుంచి ఆదివాసీ కాంగ్రెస్ బస్సుయాత్ర చేపట్టనుంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఆదివారం నాడు మహే్‌షగౌడ్ ఆవిష్కరించారు.