అఫిడవిట్‌లో చెబితే సరిపోయేది!
ABN , Publish Date - Jun 11 , 2026 | 04:47 AM
మేజిస్ట్రేట్ కోర్టులో దాఖలు చేసే ప్రైవేటు ఫిర్యాదులన్నింటినీ కేసులుగా పరిగణించాల్సిన అవసరం లేదని.. సదరు పిటిషన్‌ను కోర్టు పరిగణనలోకి (కాగ్నిజెన్స్) తీసుకున్నప్పుడు మాత్రమే ....
కోర్టు జారీ చేసిన నోటీసులకు మీనాక్షి నటరాజన్ వివరణ కూడా ఇచ్చారు
నిజానికి ప్రైవేటు ఫిర్యాదులన్నీ కేసులు కావు!
కోర్టు పరిగణనలోకి తీసుకోకుంటే అఫిడవిట్‌లో చెప్పాల్సిన పనిలేదు
మీనాక్షి నామినేషన్ తిరస్కరణ వ్యవహారంపై నిపుణుల అభిప్రాయాలు!
హైదరాబాద్, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): మేజిస్ట్రేట్ కోర్టులో దాఖలు చేసే ప్రైవేటు ఫిర్యాదులన్నింటినీ కేసులుగా పరిగణించాల్సిన అవసరం లేదని.. సదరు పిటిషన్‌ను కోర్టు పరిగణనలోకి (కాగ్నిజెన్స్) తీసుకున్నప్పుడు మాత్రమే దానికి విలువ ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కోర్టులో తనపై పెండింగ్‌లో ఉన్న ఓ ప్రైవేటు ఫిర్యాదు వివరాలు వెల్లడించలేదంటూ.. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురికావడంపై స్పందించారు. ప్రైవేటు ఫిర్యాదును కోర్టు కాగ్నిజెన్స్‌లోకి తీసుకోనప్పుడు ఆ వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించాల్సిన అవసరం లేదని.. అయితే మీనాక్షికి ఈ పిటిషన్ వివరాలు ముందే తెలిసి ఉన్నందున అఫిడవిట్‌లో పేర్కొంటే సరిపోయేదని స్పష్టం చేశారు. న్యాయ నిపుణులు తెలిపిన వివరాల మేరకు.. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎ్‌సఎ్‌స) అమల్లోకి రాకముందు సీఆర్పీసీ సెక్షన్ 200 కింద ప్రైవేటు ఫిర్యాదులు దాఖలు చేసేవారు. బీఎన్‌ఎ్‌సఎ్‌సలో ఈ సెక్షన్ 223గా మారింది. ఇందులో గత చట్టంలో లేని కీలక మార్పు తీసుకువచ్చారు. దానిప్రకారం ప్రైవేటు ఫిర్యాదు దాఖలైనప్పుడు.. ప్రతివాదులకు నోటీసు ఇవ్వకుండా, వారి వాదన వినకుండా ప్రైవేటు ఫిర్యాదును కోర్టు పరిగణన (కాగ్నిజెన్స్)లోకి తీసుకోవడానికి అవకాశం ఉండదు. అందుకే మేజిస్ట్రేట్ ప్రతివాదులకు ముందస్తు నోటీసు ఇస్తారు. దీనిని సమన్లుగా భావించరాదు. మీనాక్షి నటరాజన్‌కు సైతం ప్రైవేటు ఫిర్యాదులో ‘మీ వాదన వినిపించండి’ అని ముందస్తు నోటీసు జారీ అయింది. ఆమె కోర్టుకు వివరణ కూడా సమర్పించారు. అంతేకాదు ప్రైవేటు ఫిర్యాదును కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని, అది ఇంకా నమోదు (ఎస్‌ఆర్) దశలోనే ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
అలా అయితే చెప్పాల్సిన అవసరం లేదు: మాజీ ఏజీ బీఎస్ ప్రసాద్
ప్రైవేటు ఫిర్యాదును కోర్టు కాగ్నిజెన్స్‌లోకి తీసుకోనప్పుడు అది కేసు కాదని.. దాని వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొనాల్సిన అవసరం లేదని మాజీ అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తెలిపారు. అలాంటి ప్రైవేటు ఫిర్యాదుకు ఎలాంటి విలువ ఉండదని, అందులో ప్రతిపాదిత నిందితులుగా ఉన్నంత మాత్రాన ఎన్నికల్లో పోటీచేసే హక్కును కాదనరాదని స్పష్టం చేశారు. ఇక వ్యక్తిగత కక్షలతో ఎన్నో ప్రైవేటు ఫిర్యాదులు నమోదవుతూ ఉంటాయని, అందులో తప్పుడు ఫిర్యాదులూ ఉంటాయని.. వాటన్నింటినీ కేసులుగా పరిగణించలేమని రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయవాది వి. రవికుమార్ పేర్కొన్నారు.