మీనాక్షి నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యానికే విఘాతం
ABN , Publish Date - Jun 14 , 2026 | 04:20 AM
కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు.
ఓట్ చోరీతో పాటు సీటు చోరీకి పాల్పడుతున్న బీజేపీ: కోమటిరెడ్డి
మీనాక్షి గెలవొద్దని కుట్రపూరితంగా వ్యవహరించారు: జూపల్లి
నల్లగొండ/ఆదిలాబాద్ టౌన్/హైదరాబాద్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీకి రాజ్యసభ సీటు గెలిచే సంఖ్యాబలం లేకపోయినా మూడో అభ్యర్థిని నిలబెట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని మండిపడ్డారు. బీజేపీ ఓట్ చోరీ మాత్రమే కాకుండా సీట్ చోరీకి సైతం పాల్పడుతోందని దుయ్యబట్టారు. శనివారం నల్లగొండలో కాంగ్రెస్ బీఎల్‌ఏలకు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-సర్‌పై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సర్‌లో భాగంగా వివిధ రాష్ట్రాల్లో భారీగా ఓటర్ల పేర్లు తొలగిస్తూ అడ్డు వస్తున్న ప్రతిపక్షాల నేతలను బీజేపీ ఇబ్బంది పెడుతోందని వివరించారు. అర్హుల ఓట్లు తొలగించకుండా కాంగ్రెస్ బీఎల్‌ఏలు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. తమిళనాడులో మాజీ సీఎం స్టాలిన్, బెంగాల్‌లో మాజీ సీఎం మమతా బెనర్జీ పోటీ చేసిన తమ నియోజక వర్గాల్లో భారీగా ఓట్లు తొలగించారని.. దీంతోనే వారు ఓడిపోయారని చెప్పారు. మీనాక్షి రాజ్యసభ సీటు గెలవొద్దనే ఉద్దేశంతో కేంద్రంలోని బీజేపీ సర్కారు కుట్రపూరితంగా వ్యవహరించిందని, ఓటు చోరీతో పాటు సీటు చోరీకి సైతం పాల్పడుతోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదిలాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యసభ సీటుకు నామినేషన్ వేస్తే ఆమెపై కేసు ఉందని ఎవరో ఇచ్చిన ఫిర్యాదుతో తిరస్కరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రాహుల్ ప్రధాని అయితేనే దేశాభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు.
క్యాడర్‌ను కాపాడుకునేందుకు కేసీఆర్ నాటకాలు: ఆది శ్రీనివాస్
బీఆర్‌ఎస్ క్యాడర్‌ను కాపాడుకునేందుకే కేసీఆర్ బస్సు యాత్ర, కేటీఆర్ పాదయాత్రలంటూ నాటకాలకు తెరలేపారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దుయ్యబట్టారు. అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో ప్రగతిభవన్ దాటకుండా ఫాంహౌస్‌కే పరిమితమైన కేసీఆర్‌ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. నాడు జిల్లాల పర్యటనలు చేస్తానని గప్పాలు కొట్టి, ప్రజలను కలవకుండా నిర్లక్ష్యం చేసినందుకే జనం కర్రు కాల్చి వాత పెట్టారన్నారు. పదవిలో ఉన్నప్పుడు రాజభోగాలు అనుభవించిన కేటీఆర్..ఇప్పుడు పాదయాత్రలు చేసినా, పొర్లుదండాలు పెట్టినా సానుభూతి రాదని అన్నారు.