తెలంగాణలో మీనాక్షిపై క్రిమినల్ కేసుల్లేవు
ABN , Publish Date - Jun 10 , 2026 | 04:58 AM
మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికల అభ్యర్థిగా మీనాక్షీ నటరాజన్ దాఖలు చేసిన నామినేషన్‌ను తిరస్కరించడం బీజేపీ కుట్ర అని, దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
ఇది బీజేపీ సీట్ చోరీ.. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం
న్యాయం జరిగే వరకూ పోరాడతాం: సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 9(ఆంధ్రజ్యోతి): మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికల అభ్యర్థిగా మీనాక్షీ నటరాజన్ దాఖలు చేసిన నామినేషన్‌ను తిరస్కరించడం బీజేపీ కుట్ర అని, దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో మీనాక్షీ నటరాజన్‌పై ఎలాంటి క్రిమినల్ కేసులూ లేవన్నారు. ఓట్‌చోరీ, ఎస్‌ఐఆర్ తర్వాత ఇప్పుడు సీట్ చోరీకి బీజేపీ పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో గెలవలేకనే కుట్ర చేసి మీనాక్షీ నటరాజన్ నామినేన్‌ను తిరస్కరించారన్నారు. ఇది ప్రజాస్వామ్యంపైన దాడి అని, ప్రజల గొంతుకను అణిచివేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజు అని, దేశ ప్రజలందరూ దీనిని ఖండిచాలని కోరారు. మీనాక్షి నామినేషన్ తిరస్కరణపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, న్యాయం జరిగే వరకూ పోరాడుతామని మంగళవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. మరోవైపు మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణను టీపీసీసీ చీఫ్ మహే్‌షకుమార్‌గౌడ్, పలువురు మంత్రులు వేర్వేరు ప్రకటనల్లో తీవ్రంగా ఖండించారు. ఇది బీజేపీ రాజకీయ కుట్రకు పరాకాష్ట అని మహేష్ గౌడ్ అన్నారు. ఎన్నికల కమిషన్ ఆ పార్టీకి అనుబంధ సంఘంగా పనిచేస్తోందని ఆరోపించారు. మీనాక్షీ నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్దమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆమెపై ఎలాంటి కేసూ నమోద కాలేదని, కేసుల విచారణకు ఆమె హాజరైన సందర్భం కూడా లేదని తెలిపారు. ఎన్నికల కమిషన్ ఏకపక్ష నిర్ణయంతో ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచిందని మంత్రి సీతక్క అన్నారు. బీజేపీ కుట్ర రాజకీయాలకు మీనాక్షి నామినేషన్ తిరస్కరణను మంత్రులు దామోదర్ రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు తదితర మంత్రులు వేర్వేరు ప్రకటనల్లో తీవ్రంగా ఖండించారు.