Share News

ఆర్వో నిర్ణయం చట్టవిరుద్ధం.. రద్దు చేయండి

ABN , Publish Date - Jun 11 , 2026 | 04:40 AM

మధ్యప్రదేశ్‌ రాజ్యసభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ దాఖలు చేసిన నామినేషన్‌ తిరస్కరణపై కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

ఆర్వో నిర్ణయం చట్టవిరుద్ధం.. రద్దు చేయండి

  • అసలు కేసే లేదు.. ఏం దాచారని మీనాక్షి నామినేషన్‌ తిరస్కరిస్తారు?

  • ఆమెపై అభియోగాలే లేవు.. నేర చరిత్ర ఎక్కడి నుంచి వచ్చింది?

  • ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌33ఏను ఆర్వో ఉల్లంఘించారు

  • ఈసీకి కాంగ్రెస్‌ ఫిర్యాదు.. గతంలో హరియాణా, గుజరాత్‌లలో ఆర్వో నిర్ణయాన్ని రద్దు చేశారని వెల్లడి

న్యూఢిల్లీ, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): మధ్యప్రదేశ్‌ రాజ్యసభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ దాఖలు చేసిన నామినేషన్‌ తిరస్కరణపై కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) తీసుకున్న నిర్ణయం పూర్తిగా చట్టవిరుద్థమని, దానిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేసింది. ఆమెపై అసలు క్రిమినల్‌ కేసే లేదని.. అలాంటప్పుడు దేన్ని దాచారని నామినేషన్‌ను రద్దు చేశారని ప్రశ్నించింది. రాజ్యాంగంలోని ‘ఆర్టికల్‌ 324’ కింద ఎన్నికల సంఘానికి ఉన్న విశేషాధికారాలను ఉపయోగించి.. ఆర్వో జారీ చేసిన అన్యాయమైన ఆదేశాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు బుధవారం కాంగ్రెస్‌ అత్యున్నత బృందం న్యూఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌తోపాటు ఇతర కమిషనర్లకు ఫిర్యాదు చేసింది. కేసీ వేణుగోపాల్‌, అభిషేక్‌ మను సింఘ్వి, వివేక్‌ తంఖా, రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలా, జైరాం రమేశ్‌, దీపాదాస్‌ మున్షి, భూపేశ్‌ బఘేల్‌, మీనాక్షి నటరాజన్‌లతో కూడిన కాంగ్రెస్‌ బృందం ఈ అంశంపై ఈసీతో సుదీర్ఘంగా చర్చించింది. నామినేషన్‌ తిరస్కరణకు దారితీసిన పరిస్థితులు, రిటర్నింగ్‌ అధికారి నిర్ణయంలోని న్యాయపరమైన లోపాలను ఆధారాలతో సహా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. అనంతరం ఏఐసీసీ న్యాయ, ఆర్టీఐ, మానవహక్కుల విభాగం చైర్‌పర్సన్‌ అభిషేక్‌ మను సింఘ్వి మీడియాతో మాట్లాడారు.


అర్థరహితం.. అన్యాయం.. చట్టవిరుద్ధం..

మీనాక్షి నటరాజన్‌ నామినేషన్‌ను తిరస్కరించడానికి.. రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) చూపిన కారణాలకు చట్టపరమైన ఆధారాలు లేవని సింఘ్వి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఏదైనా క్రిమినల్‌ కేసులో కోర్టు నేరాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత మాత్రమే అది కేసుగా మారుతుందన్న ప్రాథమిక న్యాయ సూత్రాన్ని ఆర్వో విస్మరించారు. మీనాక్షి నటరాజన్‌ విషయంలో మేజిస్ట్రేట్‌ కేవలం నోటీసు మాత్రమే ఇచ్చారు. అసలు ఈ కేసును విచారణకు స్వీకరించాలా? వద్దా? అనే అంశంపైనే ఆ నోటీసు ఉంది. కోర్టు ఇంకా కాగ్నిజెన్సే తీసుకోనప్పుడు, అక్కడ అసలు క్రిమినల్‌ కేసే లేనట్లు లెక్క. కోర్టు పరిగణనలోకి తీసుకోకుండా చట్టప్రకారం ఎలాంటి క్రిమినల్‌ కేసూ ఉనికిలో ఉండదు. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్‌ 33ఏ ప్రకారం.. రెండేళ్లకు పైగా శిక్ష పడే అవకాశం ఉండి, కోర్టులో అధికారికంగా అభియోగాలు నమోదైన కేసుల వివరాలను మాత్రమే అభ్యర్థులు వెల్లడించాల్సి ఉంటుంది. అలా కాకుండా కనీసం తొలి దశ కూడా పూర్తికాకముందే క్రిమినల్‌ కేసును దాచిపెట్టారనే నెపంతో నామినేషన్‌ తిరస్కరించడం అర్థరహితం. అన్యాయం. చట్టవిరుద్ధం.’’ అని సింఘ్వీ ధ్వజమెత్తారు. రిటర్నింగ్‌ అధికారి వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని మండిపడ్డారు. ఆర్వో నిర్ణయాన్ని తిరస్కరించే/రద్దు చేసే పూర్తి అధికారాలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. గతంలో హరియాణా, గుజరాత్‌లలో సైతం రిటర్నింగ్‌ అధికారుల ఆదేశాలను ఈసీ పక్కన పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల్లో అభ్యర్థులందరికీ ‘సమాన అవకాశాల’ సూత్రాన్ని దెబ్బతీసేలా ఉన్న ఆర్వో నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి పక్షపాత నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ మౌలిక స్వరూపానికి తీవ్ర విఘాతం కలిగిస్తాయన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఇంకా గడువు ఉన్నందున ఈసీ సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

నేడు కాంగ్రెస్‌ అత్యవసర భేటీ..

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన గురువారం అత్యవసర సమావేశం జరగనుంది. ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో ఉదయం 11.30 గంటలకు జరిగే ఈ సమావేశానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇన్‌చార్జులు, పీసీసీ అధ్యక్షులు తప్పనిసరిగా హాజరుకావాలని ఏఐసీసీ సంస్థాగత, వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సర్క్యులర్‌ జారీ చేశారు. మీనాక్షి నటరాజన్‌ రాజ్యసభ నామినేషన్‌ తిరస్కరణకు గురైన నేపథ్యంలో ఈ అత్యవసర భేటీపై ఆసక్తి నెలకొంది.

Updated Date - Jun 11 , 2026 | 04:40 AM