మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ బీజేపీ కుట్ర
ABN , Publish Date - Jun 11 , 2026 | 04:46 AM
మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను తిరస్కరించడం బీజేపీ రాజకీయ కుట్రలకు పరాకాష్ట అని టీపీసీసీ...
టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం: పొన్నం
తిరస్కరణ అన్యాయం: వీహెచ్
హైదరాబాద్, జూన్ 10 (ఆంధ్రజ్యోతి) : మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను తిరస్కరించడం బీజేపీ రాజకీయ కుట్రలకు పరాకాష్ట అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ బుధవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. బీజేపీ వరుసగా కుట్రలు చేస్తూ దేశంలో ప్రజాస్వామ్యాన్ని అడ్డగోలుగా ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. మొన్నటి వరకు కేవలం ఓట్ల చోరీకి పాల్పడిన ఆ పార్టీ ఇప్పుడు ఏకంగా సీట్ల చోరీకి కూడా దిగడం తీవ్ర ఆందోళన కలిగించే అంశమన్నారు. ప్రస్తుతం ఎన్నికల కమిషన్ స్వతంత్రతను కోల్పోయి, బీజేపీ అనుబంధ సంఘంగా పనిచేస్తోందనే అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ పార్టీ పరంగా న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మీనాక్షి నామినేషన్‌ను తిరస్కరించడం అత్యంత దురదృష్టకరమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆమెపై ఎలాంటి కేసులు నమోదు కాలేదని, ఆమె ఇక్కడ కేసుల విచారణకు హాజరైన సందర్భం కూడా ఎప్పుడూ లేదని మంత్రి స్పష్టం చేశారు. నిబద్ధత కలిగిన గాంధేయవాది, కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను కుట్రపూరితంగా తిరస్కరించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ప్రభుత్వ విప్ వేముల వీరేశం విమర్శించారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ అన్యాయమని ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు అన్నారు. కేసు ఉన్నట్లు తెలియనప్పుడు అఫిడవిట్‌లో ఎలా పేర్కొంటారని ప్రశ్నించారు.
బీజేపీని నిందించడం హాస్యాస్పదం
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు బీజేపీని బాధ్యురాలిని చేయడం హాస్యాస్పదమని బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్. కుమార్ అన్నారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ ఎన్నికల కమిషన్, కోర్టులపైనా ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. బీఎల్ సంతోష్ పై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అబద్ధాల రాజకీయాలకు కేంద్రంగా మారిందని విమర్శించారు.