మహిళా నేత ఫిర్యాదు.. నాటి డీసీసీ అధ్యక్షుడిపై
ABN , Publish Date - Jun 11 , 2026 | 04:43 AM
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ఒక కేసు వివరాలను దాచారంటూ ఆమె రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ చర్య తీసుకోవడం లేదని కోర్టులో పిటిషన్
సహనిందితులుగా మహేశ్‌గౌడ్, మీనాక్షి నటరాజన్
ఈ కేసు వల్లే మీనాక్షి నామినేషన్ తిరస్కరణ
హైదరాబాద్, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ఒక కేసు వివరాలను దాచారంటూ ఆమె రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తనపై వేధింపులకు పాల్పడిన నేతపై కాంగ్రెస్ పార్టీ చర్య తీసుకోవడం లేదంటూ.. నారాయణపేట కోర్టులో ఒక మహిళా నేత వేసిన ప్రైవేటు పిటిషన్ ఆధారంగా మధ్యప్రదేశ్‌లో ఎన్నికల అధికారులు ఈ చర్య తీసుకోవడం గమనార్హం. 2019లో నారాయణపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడిగా కుంభం శివకుమార్‌రెడ్డి పనిచేశారు. ఆ సమయంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల పరిశీలకులుగా హైదరాబాద్‌కు చెందిన ఒక మహిళా నేతను పార్టీ నాయకత్వం నారాయణపేటకు పంపించింది. ఆమె దాదాపు నెల రోజులపాటు అక్కడే ఉండి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎన్నికల తర్వాత అక్కడి నుంచి వచ్చేసినా శివకుమార్‌రెడ్డితో ఆమె పరిచయం కొనసాగింది. అయితే కుంభం శివకుమార్‌రెడ్డి తనను లైంగికంగా వేధించారంటూ 2022 మేలో ఆమె నారాయణపేటలో ఆందోళన చేశారు. ఈ వ్యవహారంలో ఆమె వెనుక బీఆర్‌ఎస్ నేతలు, ఒక కాంగ్రెస్ నేత కూడా ఉన్నట్టు ప్రచారం జరిగింది. తర్వాత హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శివకుమార్‌రెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసును చూపుతూ శివకుమార్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆ మహిళా నేత కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశామని చెప్పారేగానీ.. సస్పెన్షన్ ఉత్తర్వులను తనకు చూపించలేదని, తద్వారా తన పరువుకు నష్టం కలుగుతోందంటూ కోర్టులో ప్రైవేటు పిటిషన్ దాఖలు చేశారు. అందులో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, మీనాక్షి నటరాజన్‌ను సహ నిందితురాలిగా చేర్చారు. దీనితో మీనాక్షి సహా అందరికీ కోర్టు నోటీసులు జారీ చేసింది. దీని గురించి అఫిడవిట్‌లో పేర్కొనలేదనే కారణంగానే ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో ఆమె నామినేషన్ తిరస్కరణకు గురైంది.