కాంగ్రెస్‌లో నాపై కుట్ర చేసే అవసరం ఎవరికీ లేదు
ABN , Publish Date - Jun 22 , 2026 | 04:11 AM
కాంగ్రెస్ పార్టీలో తనపై కుట్ర చేసే అవసరం ఎవరికీ లేదని.. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షీ నటరాజన్ స్పష్టం చేశారు.
అది నామినేషన్ తిరస్కరణకు ఒక రోజు ముందు బీజేపీ పుట్టించిన వదంతి
ఎన్నికల రిటర్నింగ్ అధికారితో ఆ పార్టీ కుమ్మక్కు
నా కోసం తెలంగాణలో ఎవరూ రాజ్యసభకు రాజీనామా చేయట్లేదు.. ఆ అవసరం కూడా నాకు లేదు
నా రాజకీయం మధ్యప్రదేశ్‌లోనే.. మీనాక్షీ నటరాజన్ స్పష్టీకరణ
హైదరాబాద్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీలో తనపై కుట్ర చేసే అవసరం ఎవరికీ లేదని.. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షీ నటరాజన్ స్పష్టం చేశారు. అది బీజేపీ పుట్టించిన వదంతి అని కొట్టి పారేశారు. మధ్యప్రదేశ్ రాజ్యసభ అభ్యర్థిగా తన నామినేషన్ తిరస్కరణకు ఒక రోజు ముందు ఆ పార్టీ ఈ పుకారు పుట్టించిందన్నారు. అలాగే తెలంగాణ నుంచి తనను రాజ్యసభకు పంపేందుకు ఒక రాజ్యసభ సభ్యునిచేత రాజీనామా చేయిస్తున్నారన్న వార్త కూడా పూర్తిగా అవాస్తవమన్నారు. ఒకరి చేత రాజీనామా చేయించి ఆ రాజ్యసభ సీటును తీసుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. తన రాజకీయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంటుందని ఆమె తేల్చిచెప్పారు. తమకు ప్రతి సీటూ, ప్రతి సభ్యుడూ ముఖ్యమేనన్నారు. దేశం కోసం అవసరమైనప్పుడు మాత్రమే అలా చేయిస్తారని చెప్పారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, పార్టీ జాతీయ నేత అభిషేక్ మను సింఘ్వి విషయంలో అవసరం కాబట్టే చేయించామని పేర్కొన్నారు. గాంధీభవన్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడిన మీనాక్షీ నటరాజన్.. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో ఒక స్థానానికి అవసరమైన 58 మంది సభ్యుల బలం ఉన్నందునే కాంగ్రెస్ అధిష్ఠానం తనను అభ్యర్థిగా ఎంపిక చేసిందని గుర్తుచేశారు.
బీజేపీకి ఉన్న సంఖ్యా బలానికి మూడో రాజ్యసభ సీటు వచ్చే అవకాశం ఏమాత్రం లేకున్నా.. ఫౌల్ గేమ్ ఆడాలని ముందే ప్రణాళిక వేసుకున్న ఆ పార్టీ తన అభ్యర్థిని రంగంలోకి దించిందని మండిపడ్డారు. డబ్బులు, బెదిరింపులతో మూడో సీటు రాదని గ్రహించిన బీజేపీ.. ఎన్నికల రిటర్నింగ్ అధికారితో కుమ్మక్కయిందని ఆరోపించారు. తనపై ఎలాంటి క్రిమినల్ కేసులూ లేవని, తెలంగాణలో కేసుకు సంబంధించి కేవలం నోటీసు ఇచ్చారని, అది ప్రీ కాగ్నిజెన్స్‌లోనే ఉందని పేర్కొన్నారు. ఆ కేసును ఫారమ్ 26లో పేర్కొనాల్సిన అవసరమూ లేదన్నారు. దీన్ని గురించి తనను రిటర్నింగ్ అధికారి అడిగినప్పుడు కూడా ఆ కేసు ఎఫ్‌ఐఆర్ కాలేదని స్పష్టం చేశానన్నారు. 2023లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో నామినేషన్‌ను సవరించుకునేందుకు పరిమళ్ నత్వానీకి 24 గంటల సమయం ఇచ్చిన ఎన్నికల కమిషన్.. తనకు మాత్రం ఆ అవకాశం ఇవ్వలేదన్నారు. తన నామినేషన్ తిరస్కరణ అంశంలో ఎన్నికల కమిషన్ కుమ్మక్కయిందనే విషయం స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు. తన నామినేషన్ తిరస్కరణకు గురైంది కేసు వల్ల కాదని.. బీజేపీ, ఎన్నికల కమిషన్ కుమ్మక్కయినందువల్లనే జరిగిందని ఆరోపించారు. ఈ పనిణామంతో తాము ఒక్క నిమిషం కూడా నిరాశ చెందలేదన్నారు. బీజేపీ ఎలాంటి రాజకీయం చేస్తోందో దీని ద్వారా దేశానికి చూపించామన్నారు. తాను ఎప్పుడూ బాధితుల పక్షమేనన్న మీనాక్షి.. శివకుమార్‌రెడ్డి కేసులో తీవ్రతను గ్రహించే ఆయనకు ఎన్నికల్లో టిక్కెట్టు ఇవ్వలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.