ఫ్లైఓవర్ పిల్లర్‌ను ఢీకొన్న కారు
ABN , Publish Date - Jan 29 , 2026 | 05:02 AM
వారంతా ఒకే ప్రాంతానికి చెందిన చిన్ననాటి స్నేహితులు. చిన్నప్పటి నుంచి వనపర్తి పట్టణంలో కలిసి చదువుకున్నారు. పాఠశాల విద్య పూర్తయ్యాక ఉన్నత చదువుల కోసం అందరూ హైదరాబాద్‌కు వచ్చారు.
మేడిపల్లిలో ఇద్దరు బీటెక్ విద్యార్థుల మృతి
మరో ఇద్దరికి విషమం నలుగురికి గాయాలు
అందరూ వనపర్తికి చెందిన చిన్ననాటి స్నేహితులు ఆ
పీర్జాదిగూడ/వనపర్తి, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): వారంతా ఒకే ప్రాంతానికి చెందిన చిన్ననాటి స్నేహితులు. చిన్నప్పటి నుంచి వనపర్తి పట్టణంలో కలిసి చదువుకున్నారు. పాఠశాల విద్య పూర్తయ్యాక ఉన్నత చదువుల కోసం అందరూ హైదరాబాద్‌కు వచ్చారు. ఒక్కొక్కరు ఒక్కో కాలేజీలో చేరి చదువుకుంటూ.. తరచుగా కలుసుకుంటుండేవారు. అయితే వీరి స్నేహాన్ని చూసి విధి అసూయ పడింది. ఎనిమిది మంది స్నేహితులు సరదాగా కలుసుకొని కారులో వెళ్తుండగా.. ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రగాయాలపాలై చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిఽధిలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గీతం యూనివర్సిటీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న నిఖిల్(22), వెంకట్(23), ఓయూలోని డిగ్రీ కాలేజీలో చదువుతున్న సాయివరుణ్(22), సీఎంఆర్ కాలేజీలో చదువుతున్న రాకేష్(22), ఘట్‌కేసర్‌లోని అనురాగ్ యూనివర్సిటీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న అభినవ్(21), యశ్వంత్‌రెడ్డి (22), హర్షవర్ధన్ (22), సిద్దార్థ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న సాత్విక్ (22) ఒకే స్కూల్‌లో చదువుకున్న చిన్ననాటి స్నేహితులు. ప్రస్తుతం నగరంలో చదువుకుంటున్న వీరు సమయం దొరికినప్పుడల్లా కలుసుకుంటుంటారు. ఈ క్రమంలోనే మంగళవారం అందరూ కలిసి మౌలాలిలోని రాకేశ్ అన్నయ్య మాధవ్ రూమ్ వద్ద కలుసుకున్నారు. అనంతరం బుధవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో అభినవ్, యశ్వంత్‌రెడ్డి, హర్షవర్ధన్ ఉండే పోచారంలోని సద్భావన టౌన్‌షి్‌పకు వెళ్లేందుకు మహేంద్ర ఎక్స్ యూవీ 700 కారులో మౌలాలి నుంచి బయలుదేరారు. కారును నడుపుతున్న నిఖిల్.. ఓవైపు నిద్ర మత్తు, మరోవైపు అతివేగంతో వెళ్లడంతో మేడిపల్లి పిల్లర్ నంబరు 97 వద్దకు రాగానే కారు అదుపుతప్పి ఫ్లై ఓవర్ పిల్లర్‌ను ఢీకొట్టింది. గమనించిన స్థానికులు 100కు ఫోన్ చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోగా.. అప్పటికే నిఖిల్, సాయివరుణ్ మృతి చెందారు. వెంకట్, రాకే్‌షలకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పపత్రికి తరలించారు. మిగిలిన నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మృతి చెందిన వారిని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించిన పోలీసులు వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.