మేడిగడ్డ పునరుద్ధరణ..మీ సొంత ఖర్చుతోనే జరగాలి
ABN , Publish Date - Feb 15 , 2026 | 07:08 AM
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి కాంట్రాక్టు సంస్థతో ఉన్న ఒప్పంద కాలంలోనే నష్టాలు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం మరోమారు గుర్తు చేసింది.
లేకపోతే కఠిన చర్యలకు ఉపక్రమిస్తాం
ఎల్ అండ్ టీకి మరోమారు ప్రభుత్వం హెచ్చరికలు
హైదరాబాద్, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి కాంట్రాక్టు సంస్థతో ఉన్న ఒప్పంద కాలంలోనే నష్టాలు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం మరోమారు గుర్తు చేసింది. ఇది వరకు జారీ చేసిన ‘పనుల పూర్తి(కంప్లీషన్) సర్టిఫికెట్’ను అందుకే రద్దు చేశామని నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీకి స్పష్టం చేసింది. ఈ లెక్కన నిర్మాణ సంస్థ ఇంకా బ్యారేజీని ప్రభుత్వానికి అప్పగించలేదని పేర్కొంది. బ్యారేజీ పునరుద్ధరణ పనులను పూర్తిగా కాంట్రాక్టు సంస్థ సొంత ఖర్చులతోనే చేపట్టాలని తేల్చిచెప్పింది. పునరుద్ధరణకు అవసరమైన పరిశోధనలు, తదనంతర చర్యల అంశంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ, కేంద్ర నీటి, విద్యుత్ పరిశోధన కేంద్రం (సీడబ్ల్యూపీఆర్‌ఎస్), డిజైన్ కన్సల్టెంట్‌లకు సంపూర్ణ సహకారం అందించాలని స్పష్టం చేసింది. మేడిగడ్డ మరమ్మతుల బాధ్యత నిర్మాణ సంస్థదేనని.. ఈ మేరకు సిబ్బంది, సామాగ్రి, యంత్రాలను బ్యారేజీ వద్దకు తరలించాలని ఈ ఏడాది జనవరి 3న ఎల్ అండ్ టీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. దానికి బదులిస్తూ.. పరస్పర అంగీకారంతో రూపొందించే నిబంధనల ఆధారంగానే పునరుద్ధరణ చేపడతామని ఎల్ అండ్ టీ పేర్కొంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 3న ఎల్ అండ్ టీకి మరో లేఖ రాసింది. ఆ వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. బ్యారేజీ పునరుద్ధరణ పనుల్లో పరస్పర అంగీకారం అనే ప్రసక్తే ఉత్పన్నం కాదని, ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్సిందేనని ఎల్ అండ్ టీకి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా లేఖలో స్పష్టం చేసింది. కాంట్రాక్టు సంస్థ మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించిందని ఎన్డీఎ్‌సఏ, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్, విజిలెన్స్ నివేదికలు తేల్చాయని పేర్కొంది. మేడిగడ్డ బ్యారేజీ ఇంకా నిర్మాణంలోనే ఉండటంతో.. నిర్మాణ సంస్థ, నీటిపారుదల శాఖ మధ్య ఒప్పందం ఇప్పటికీ కొనసాగుతోందని పునరుద్ఘాటించింది. అందువల్ల నిర్మాణ సంస్థ సొంత ఖర్చుతోనే పునరుద్ధరణ పనులు చేపట్టాలని తేల్చి చెప్పింది. సహకరించకుంటే కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని హెచ్చరించింది.