మేడిగడ్డ నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ మెయిన్ క్యాంప్ ఆఫీసులో అగ్ని ప్రమాదం
ABN , Publish Date - May 25 , 2026 | 04:40 AM
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ మెయిన్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైపోయింది.
దగ్ధమైన ఫైళ్లు, కంప్యూటర్లు, గెస్ట్‌హౌస్
మహదేవపూర్ రూరల్, మే 24(ఆంధ్రజ్యోతి) : మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ మెయిన్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైపోయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్‌పల్లిలోని ఈ కార్యాలయంలో పలు కంప్యూటర్లు, ఫైళ్లు, ఎల్‌అండ్‌టీ అధికారులు బస చేసే గెస్ట్‌హౌస్ కాలిబూడిదయ్యాయి.. ఈ ఘటనపై మేడిగడ్డ ఇంజనీరింగ్ అధికారులను సంప్రదించగా పక్కనే ఉన్న పంట పొలాల నుంచి మంటలు వ్యాపించడంతో ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా.. ఉద్దేశపూర్వకంగా నిప్పుపెట్టారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం నుంచి కుంగుబాటు వరకు నిత్యం వార్తల్లో నిలవడంతో ఎల్‌అండ్‌టీ కార్యాలయం దగ్ధం కావడం చర్చనీయాంశమైంది.