Share News

కన్నెపల్లిలో పంపింగ్‌ సాధ్యం కాదు

ABN , Publish Date - Jul 19 , 2026 | 06:09 AM

ప్రస్తుతం ప్రాణహితకు వస్తున్న వరద ఆధారంగా కన్నెపల్లి(మేడిగడ్డ) పంప్‌హౌస్‌ను నడిపించలేమని, ఒక్కసారి మోటార్‌ను ఆన్‌ చేయగానే అక్కడ నీళ్లన్నీ ఖాళీ అవుతాయని, ఆ తర్వాత నీరందక పంపులు దెబ్బతినే అవకాశం ఉంటుందని..

కన్నెపల్లిలో పంపింగ్‌  సాధ్యం కాదు

  • కనీసం 5.5 లక్షల క్యూసెక్కుల వరద ఉండాలి

  • నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కు వివరించిన నిపుణులు

హైదరాబాద్‌, జూలై 18 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం ప్రాణహితకు వస్తున్న వరద ఆధారంగా కన్నెపల్లి(మేడిగడ్డ) పంప్‌హౌస్‌ను నడిపించలేమని, ఒక్కసారి మోటార్‌ను ఆన్‌ చేయగానే అక్కడ నీళ్లన్నీ ఖాళీ అవుతాయని, ఆ తర్వాత నీరందక పంపులు దెబ్బతినే అవకాశం ఉంటుందని నిపుణులు, ఇంజనీర్లు హెచ్చరించారు. పంపులు ఆన్‌ చేయాలంటే కనీసం 5.5 లక్షల క్యూసెక్కుల వరద ఉండాలని నివేదించారు. శనివారం సచివాలయంలో ఇంజనీరింగ్‌ అధికారులు, నిపుణులతో నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ‘‘ప్రాణహిత నుంచి వరద పోతుందని, మేడిగడ్డ బ్యారేజీ గేట్లు మూయకుండానే పంపింగ్‌ చేయవచ్చని బీఆర్‌ఎస్‌ చేస్తున్న ప్రచారంలో వాస్తవం ఉందా?’’ అని మంత్రి ఆరా తీయగా... కన్నెపల్లి పంపులు నడపాలంటే కనీసం 5.5 లక్షల క్యూసెక్కుల వరద అవసరమని, అప్పుడే పంపులు సాఫీగా తిరుగుతాయని, వేల క్యూసెక్కుల వరద ఆ భారీ పంపులకు చాలదని చెప్పారు. ప్రస్తుతం ప్రాణహితలో 16 వేల క్యూసెక్కుల వరద మాత్రమే వస్తుందని, ఈ వరదతో పంపింగ్‌కు ఏ మాత్రం అవకాశాల్లేవని మంత్రికి వివరించారు. ఈ పంపులు నడిపించడం కంటే ముందు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల గేట్లు మూసి, నీటి నిల్వ కోసం జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎస్ఏ) అనుమతి తీసుకోవడం ముఖ్యమని, ఎన్‌డీఎస్ఏ లేఖతోనే ఆ బ్యారేజీల్లో నీటి నిల్వ సాధ్యమని తెలిపారు. దీనికోసం ఎన్‌డీఎస్ఏ అధికారులతో సంప్రదింపులు జరపాలని సూచించారు.


ఎన్‌డీఎస్ఏ నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం బ్యారేజీల్లో పరీక్షలన్నీ పూర్తయినందున వాటి ఫలితాల కోసం వేచి ఉండాలని, ఫలితాలు వచ్చాక వాటి ఆధారంగా పునరుద్ధరణ డిజైన్లు సిద్ధం చేయించి, ఆ డిజైన్లను కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ), ఎన్‌డీఎస్ఏతో మదింపు చేయించుకోవాలన్నారు. ఆ తర్వాత పునరుద్ధరణ పనుల్లో వేగం పెంచాలన్నారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో భారీగా సీపేజీలు బయటపడ్డాయని, ఆ సీపేజీలకు గ్రౌటింగ్‌ చేయకుండా నీటి నిల్వ సురక్షితం కాదని అధికారులు గుర్తుచేశారు. అన్నారం బ్యారేజీ సామర్థ్యం 10.87 టీఎంసీలు కాగా... 2020లో 33, 34, 44 వెంట్‌ల వద్ద సీపేజీలు కనిపించాయని, మళ్లీ 2023లో 28, 38 వెంట్‌ల వద్ద సీపేజీలు ఏర్పడ్డాయని తెలిపారు. సుందిళ్ల బ్యారేజీ సామర్థ్యం 8.83 టీఎంసీలు కాగా... 33, 46, 50, 52 బే లలో సీపేజీలు ఏర్పడ్డాయని గుర్తుచేశారు. రెండు బ్యారేజీల్లో నీటి నిల్వకన్నా ముందు సీపేజీలు రాకుండా గ్రౌటింగ్‌ చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుత వరదతో పంపింగ్‌కు అనుకూలత లేదని, మోటార్లు నడిపితే పంపులు దెబ్బతింటాయని, హెడ్‌ తగిలేలా నీటిని నిల్వ చేస్తేనే తగినంత పంపింగ్‌కు అవకాశం ఉంటుందని తెలిపారు. అయితే ఎన్‌డీఎ్‌సఏ అనుమతి లేకుండా అన్నారం, సుందిళ్ల బ్యారేజీల గేట్లను మూయడం, నీటిని నిల్వ చేయడం తగదని సూచించారు.

Updated Date - Jul 19 , 2026 | 06:10 AM