ఏడాదిలో ‘మేడిగడ్డ’ అందుబాటులోకి..
ABN , Publish Date - Jun 11 , 2026 | 04:36 AM
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులను 2027 జూన్, జూలై కల్లా పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు.
2027 జూన్/జూలై నాటికి పునరుద్ధరిస్తాం
నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
భూపాలపల్లి/నిజామాబాద్, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులను 2027 జూన్, జూలై కల్లా పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. జూలై నాటికి పనులు పూర్తిచేసి నీటి విడుదలకు సిద్ధం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. బుధవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద జరుగుతున్న పరీక్షలను కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ కల్నల్ పరిక్షిత్ మెహ్రా, సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించారు. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చడమే మొదటి తప్పిదమని గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కమీషన్ల కోసం తీసుకున్న తప్పుడు నిర్ణయంతో తెలంగాణకు తీరని ద్రోహం చేశారని ఆరోపించారు. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణంలో లోపాలు ఉన్నట్లు కేంద్ర సంస్థల విచారణలో తేలిందని వెల్లడించారు. అయినా దీనిపై తమకు రాజకీయ దురుద్దేశం లేదని.. శాస్త్రీయ పద్ధతుల్లో బ్యారేజీల పునరుద్ధరణకు డిజైన్ కన్సల్టెంట్‌గా ముంబెకి చెందిన సంస్థను నియమించినట్లు తెలిపారు. ఎన్‌డీఎ్‌సఏ సూచనల మేరకు జియోటెక్నికల్, హైడ్రాలిక్ పరీక్షలు జరుగుతున్నాయని చెప్పారు. వచ్చే నెల మొదటి వారంలోగా పరీక్షలు పూర్తి చేసి ఆగస్టు, సెప్టెంబరులో డిజైన్ రూపొందించి, సీడబ్ల్యూసీ, ఎన్‌డీఎ్‌సఏ అనుమతులు తీసుకుంటామని తెలిపారు. నవంబరు, డిసెంబరు నుంచి పనులు ప్రారంభించి ఒక్క వర్కింగ్ సీజన్‌లోనే పూర్తి చేస్తామన్నారు. మూడు బ్యారేజీల్లో సుమారు 90 శాతం జీపీఆర్ స్టడీస్, 75-80 శాతం బోర్‌హోల్స్ డ్రిల్లింగ్ పూర్తయ్యాయని చెప్పారు. నాన్ డిస్ట్రక్టివ్ పరీక్షల్లో కాంక్రీట్ క్వాలిటీలో పెద్ద లోపాలు లేవని ప్రాథమికంగా తేలిందన్నారు. ఇతర పరీక్షల్లో లోపాలు ఉన్నాయని ఎన్‌డీఎ్‌సఏ గుర్తించిన నేపథ్యంలో వాటిని సరిచేస్తూ కొత్త డిజైన్ రూపొందిస్తున్నామని తెలిపారు. మేడిగడ్డ బ్లాక్-7 పునరుద్ధరణకు ప్రత్యేక ప్లాన్ సిద్ధం చేశామని, 2027 నాటికి పునరుద్ధరణ పూర్తిచేసి, 50-70 ఏళ్ల పాటు బ్యారేజీలు పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఉత్తమ్ చెప్పారు.
ఉత్తర తెలంగాణ ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం
ఉత్తర తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జాకోరలో రూ.106 కోట్ల వ్యయంతో 7,975 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే జాకోర, చందూర్ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి బుధవారం ప్రారంభించారు. అంతకుముందు ఆయన సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జాకోరలో బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి రంగానికి, పౌర సరఫరాలకు ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల పూడికతీత చేపట్టి రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం పెంచుతామన్నారు. సిద్దాపూర్ ప్రాజెక్టు పూర్తికి రూ.200 కోట్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.