Share News

మేడిగడ్డ మరమ్మతులు వచ్చే ఏడాదే!

ABN , Publish Date - Feb 23 , 2026 | 02:57 AM

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు వచ్చే ఏడాది వేసవిలో చేపట్టే అవకాశాలున్నాయి. జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ ...

మేడిగడ్డ మరమ్మతులు వచ్చే ఏడాదే!

  • పునరుద్ధరణ డిజైన్లు, సీడబ్ల్యూసీ ఆమోదం కోసం ఆగక తప్పదు

  • సొంత సొమ్ముతో చేపట్టేందుకు నిర్మాణ సంస్థలు ససేమిరా

హైదరాబాద్‌, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు వచ్చే ఏడాది వేసవిలో చేపట్టే అవకాశాలున్నాయి. జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్‌డీఎ్‌సఏ) నిపుణుల కమిటీ సిఫారసుల ప్రకారం ప్రస్తుతం మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద పరీక్షలు జరుగుతున్నాయి. అవి పూర్తయిన వెంటనే మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణకు ఎంపికైన ఆఫ్రీ ఇండియా (ముంబై) సంస్థకు నివేదికలు అందించనున్నారు. వాటి ఆధారంగా పునరుద్ధరణకు డిజైన్లు అందిస్తే.. వాటిని కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ)తో పరిశీలన చేయించుకోవాల్సి ఉంటుంది. సీడబ్ల్యూసీ ఆమోదించిన తర్వాతే బ్యారేజీల మరమ్మతుల దిశగా అడుగులు పడనున్నాయి. ఇప్పటికే బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్ల కోసం ఆఫ్రీ ఇండియా అనే సంస్థను ఎంపిక చేయగా దాంతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. మేడిగడ్డ మరమ్మతులకు రూ.500 కోట్ల పైనే ఖర్చవుతుందని, అన్నారం, సుందిళ్లలో సీపేజీల కట్టడి గ్రౌటింగ్‌ కోసం రూ.100 కోట్లలోపు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా బ్యారేజీలను నిర్మించిన మూడు నిర్మాణ సంస్థలకు అధికారులు వార్నింగ్‌లు ఇచ్చే పనిలో ఉన్నా ఏ సంస్థా కూడా ఉచితంగా మరమ్మతులు చేసేందుకు ముందుకొచ్చే దాఖలాలు కనిపించడం లేదు. మేడిగడ్డకు జారీ చేసిన సర్టిఫికెట్‌ను రద్దు చేసినప్పటికీ ఆ నిర్ణయం న్యాయస్థానంలో చెల్లుబాటు కాదని నిపుణులు చెబుతున్నారు. దాంతో ప్రభుత్వం నిధులు వెచ్చించి... మరమ్మతులు చేయించుకోవడం తప్ప మరో మార్గం లేదని సూచిస్తున్నారు.

Updated Date - Feb 23 , 2026 | 02:57 AM