మేడిగడ్డలో నత్తనడకన బోర్‌హోల్ పనులు
ABN , Publish Date - Apr 22 , 2026 | 05:11 AM
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ భవితవ్యాన్ని తేల్చేందుకు చేపట్టే పరీక్షలకు కీలకమైన బోర్‌హోల్స్ డ్రిల్లింగ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి.
డ్రిల్లింగ్ యంత్రాల కొరత వల్లే ఆలస్యం
బోర్‌హోల్స్ డ్రిల్లింగ్ పూర్తయితేనే.. బ్యారేజీ భవితవ్యాన్ని నిర్ణయించే టెస్టులు
బ్యారేజీ మొత్తంలో 505 బోర్‌హోల్స్ ఒక్కొక్కటి 15- 30 మీటర్ల లోతు
ఒక్కో మెషిన్‌తో రోజుకు 5 మీటర్లే డ్రిల్లింగ్
మే నెలాఖరుకు టెస్టులు పూర్తి చేయాలన్న లక్ష్యం
మహదేవపూర్ రూరల్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ భవితవ్యాన్ని తేల్చేందుకు చేపట్టే పరీక్షలకు కీలకమైన బోర్‌హోల్స్ డ్రిల్లింగ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. డ్రిల్లింగ్ మెషిన్ల (రిగ్స్) కొరతే ఇందుకు కారణమని తెలుస్తోంది. కానీ, బోర్‌హోల్స్ డ్రిల్లింగ్ పనులు పూర్తయితేనే అప్ స్ర్టీమ్, డౌన్ స్ర్టీమ్‌ల వద్ద జియో ఫిజికల్, జియో టెక్నికల్ టెస్టులతోపాటు జీపీఆర్, ఇతర పరీక్షలు చేసే అవకాశం ఉంటుంది. కుంగుబాటుకు గురైన మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌తోపాటు మిగతా ఏడు బ్లాకుల్లోనూ జియో ఫిజికల్, జియో టెక్నికల్, జీపీఆర్ తదితర టెస్టులు చేయాలని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్‌డీఎ్‌సఏ) సూచించింది. ఈ మేరకు మొత్తం ఎనిమిది బ్లాకుల్లో 505 బోర్‌హోల్స్ డ్రిల్లింగ్ చేపట్టాల్సి ఉండగా అందులో 16 బోర్‌హోల్స్ 30 మీటర్ల లోతు వరకు, 45 బోర్‌హోల్స్ 18 మీటర్ల లోతు వరకు మిగతా 444 బోర్‌హోల్స్ 15 మీటర్ల వరకు చేపట్టాల్సి ఉంటుంది. ఇవే కాకుండా గతంలో పూర్తయిన మరో 15 బోర్‌హోల్స్‌ను వాడుకుని అందులోనే ప్రతిదానినీ మరో 15 మీటర్ల వరకు డిల్లింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే.. ఒక్కో బోర్‌హోల్ డ్రిల్లింగ్ యంత్రం రోజంతా పనిచేస్తే సగటున 5-6 మీటర్ల లోతు వరకు మాత్రమే డ్రిల్లింగ్ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మొన్నటి వరకు కేవలం ఒకే ఒక్క డ్రిల్లింగ్ మెషిన్‌తో ఈ ప్రక్రియ చేపట్టగా.. ఎనిమిది బోర్‌హోల్స్ మాత్రమే పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో మరో ఐదు రిగ్స్ వచ్చినప్పటికీ.. ప్రస్తుతం మూడు మాత్రమే పనిచేస్తున్నాయి. ఈ నెలాఖరు వరకు మరికొన్ని అడ్వాన్స్‌డ్ రిగ్స్ తీసుకొచ్చే అవకాశం ఉన్నా.. అవి ఏ మేరకు పనిచేస్తాయో తెలియాల్సి ఉంది. మే నెలాఖరులోగా పరీక్షలు పూర్తి చేయాలంటే ఇప్పుడున్న రిగ్స్‌తోపాటు మరో 100పైగా రిగ్స్ అవసరం ఉంది.
బోర్‌హోల్స్ డ్రిల్లింగ్ పూర్తయితేనే పరీక్షలు..
బోర్‌హోల్స్ డ్రిల్లింగ్ పూర్తయితేనే సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్) బృందం పరీక్షలు చేపట్టనుంది. బ్యారేజీ కింద భూమి స్వరూపం తెలుసుకునేందుకు జియో ఫిజికల్, భూస్వభావం తెలుసుకునేందుకు జియో టెక్నికల్ పరీక్షలు చేస్తారు. ఈ పరీక్షల ఆధారంగానే బ్యారేజీ పునరుద్ధరణ చేపడతారు. ప్రస్తుతం ఉన్న రిగ్ రోజంతా పనిచేస్తే సగటున ఐదు మీటర్ల వరకే డ్రిల్ చేస్తుండగా.. ఇంతకంటే అడ్వాన్స్‌డ్ రిగ్స్ వస్తే 6-10 మీటర్ల వరకు డ్రిల్ చేసే అవకాశం ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. బోర్‌హోల్స్ సకాలంలో పూర్తయితే పరీక్షలు మే నెలాఖరుకు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. నిర్ణీత గడువు లోపు అంటే.. వర్షాకాలం ప్రారంభంలోపు బోర్‌హోల్స్ పూర్తి చేయకపోతే పరీక్షల అంశం మళ్లీ మొదటికి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇందుకు బోర్‌హోల్ డ్రిల్సే ప్రధానం కానున్నాయి. ఈ డ్రిల్స్‌ను త్వరితగతిన పూర్తిచేసేందుకు రిగ్స్ సంఖ్య పెంపు తప్పనిసరి కావడంతో అధికారులు ఆ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. వీటి సంఖ్య తక్కువగా ఉండటంతో దేశ వ్యాప్తంగా వీటిని సమకూర్చేందుకు ఆ శాఖ అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సుమారు 100 వరకు రిగ్స్ అవసరమని భావించినప్పటికీ.. అంత మొత్తంలో ఇప్పటికిప్పుడే సమకూరడం కష్టమేనంటున్నారు. రిగ్స్ సంఖ్య తక్కువగా ఉండటమే కాకుండా.. దొరికిన వాటిని ఆపరేట్ చేసేందుకు టెక్నికల్ సిబ్బందిని సమకూర్చడం కూడా ప్రయాసేనంటున్నారు. మరో వారం రోజుల్లో రిగ్స్ సంఖ్య పెంచి బోర్‌హోల్ పనులను వేగవంతం చేయనున్నట్లు అధికారులు చెబుతున్నప్పటికీ అవి వచ్చేవరకు ఏమీ చెప్పలేమని అంటున్నారు.